
Amaravati Lands Auction: నవ్వి పోదురుగాక నక్కేంటి సిగ్గు అన్నట్టుంది ఏపీలో వైసీపీ పరిస్థితి. అమరావతిని రాజధానిగా పలికేందుకే ఇష్టపడని జగన్ ఇప్పుడు అక్కడి భూములను ఈ వేలం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రాజధానిగా అభివృద్ధి చేయకపోగా భూములను అమ్మి సొమ్ము చేసుకోవడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని కట్టేందుకు అమరాతిలో పెద్ద ఎత్తున భూములను సేకరించింది. వైసీపీ వచ్చిన తరువాత పూర్తిగా పక్కన పెట్టేసింది. జరుగుతున్న నిర్మాణాలను నిలిపేసింది. దీంతో అప్పటి వరకు హడావుడిగా ఉన్న ఆ ప్రాంతమంతా నిర్జీవంగా తయారైపోయింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినా, కాగితాల్లో మాత్రం అమరావతే రాజధానిగా ఉండటంతో అక్కడ సమీప భూములకు ధరలు మాత్రం తగ్గడం లేదు.
అప్పులతో కాలం వెళ్ళబుచుతున్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు నిధుల సమీకరణ కోసం అష్టకష్టాలు పడుతుంది. ఈ క్రమంలోనే అమరావతిలో 14 ఎకరాలను అమ్మకానికి పెట్టినట్లుగా తెలుస్తుంది. రాజధాని ప్రాంతాన్ని కలపుకుంటూ వెళ్తున్న బైపాస్ ప్రాంతం కాజ-గుండగొలను సమీపంలోని నవులూరు వద్ద 10 ఎకరాలు విక్రయించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదలైన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇక్కడ ఎకరం ధర రూ.5,94,50,000గా నిర్ణయించారు. అలాగే, సీడ్ యాక్సెస్ రహదారి పక్కనే పిచ్చుకలపాలెం వద్ద నాలుగు ఎకరాలను అమ్ముతున్నారు. దీని ధర ఎకరానికి రూ.5,41,04,400 అని తెలియజేశారు.
ఇంతటి విలువైన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. తమ త్యాగాలకు గుర్తింపు లేకుండా చేశారు.. ఇక్కడ ఏమీ లేదు ఏడారి అని, స్మశానం అని అన్నవారు ఇప్పుడు భూములు అమ్ముకోవడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తుతున్నారు.

అయితే, ఈ విమర్శలను వైసీపీ ప్రభుత్వం లెక్క చేయడం లేదు. నాలుగేళ్ల నుంచి పట్టించుకోని రాజధాని భూముల జోలికి ఇప్పుడెందుకు వస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ అనునాయులకు అప్పగించేందుకా లేదా దీక్షలు చేస్తున్న రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.