Mining Mafia: వారంతా గిరిజన మహిళా రైతులు. పురుషులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లగా.. మహిళలు అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని విక్రయించడం ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎలాగోలా కుటుంబ జీవనం గడుపుతుండగా.. మైనింగ్ మాఫియా వారి జీవితాల్లో కల్లోలాన్ని రేపింది. అధికార బలంతో వారి జీడితోటలను సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. బాధిత మహిళలు అధికారుల కాళ్లవేళ్లా పడిన వినలేదు సరికదా…మైనింగ్ మాఫియాకు అమ్ముడుపోయారు. తమ కంఠ ఘోషను వినే నాథుడు లేక బాధిత గిరిజన మహిళలు ఉరితాళ్లను ఆశ్రయించారు. తమకు ఆత్మహత్యే శరణ్యమని చెబుతూ చీర కొంగులు, తాళ్లతో ఉరి వేసుకునే ద్రుశ్యాలు ఇప్పుడు నెట్టింట్టో వైరల్ అవుతున్నాయి. ఉత్తరాంధ్రలో వెలుగుచూసిన ఘటనకు సంబంధించి అంతటా చర్చనీయాంశమయ్యాయి. అధికారుల ఉదాసీనత, మైనింగ్ మాఫియా ఆగడాలను చాటిచెప్పాయి. అనకాపల్లి జిల్లా మాడుగల మండలం ఉరవకొండకు చెందిన మహిళలు గత కొన్నేళ్లుగా జీడి తోటలను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు తమ ప్రాంతంలో జీడి సాగు చేస్తున్న తోటలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్‌కు అప్పగించే యోచనలో ఉన్నట్లు వార్త బయటకురావడంతో ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వినతులిచ్చారు. కానీ పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో చివరి అస్త్రంగా ఈ విధంగా మెడలకు ఉచ్చు తాళ్లు బిగించుకొని చెట్లకు ఉరివేసుకుంటున్నట్లుగా నిరసన తెలుపుతూ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. విపరీతంగా ఈ ఫొటోలు ట్రోలింగ్ అవుతున్నాయి.

Also Read: జగన్ ను బెదిరిస్తున్న మంత్రులు.. లొంగిపోతారా?
ప్రభుత్వం ఉపాధి కల్పన కింద తమకు అప్పగించిన భూముల్లో జీడి సాగు చేసుకొని బతుకుతున్నామని ..ఇప్పుడు బడా నేతలు మైనింగ్ కోసం భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి తోటల చుట్టు పక్కల ఉన్న భూములు మైనింగ్‌కి కేటాయించడంతో ఇప్పుడు రోడ్డు వేయడానికి తమ తోటల్ని ధ్వంసం చేస్తున్నారని గిరిజన మహిళలు చెబుతున్నారు. గ్రానైట్ కంపెనీకి అప్పగించిన భూములు తమవేనని..కాకపోతే వాటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో తిరిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల్ని ఆశ్రయిస్తే స్థానిక రెవెన్యూ అధికారి కార్యాలయం సిబ్బంది తమను బెదిరించారని చెబుతున్నారు. పైగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. తహసీల్దారుతో పాటు ఇతర అధికారులు మైనింగ్ కంపెనీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.దశాబ్దాలుగా సాగు చేస్తున్న జీడి తోటల మధ్యలో రోడ్లు వేస్తే తమ పంటలు పూర్తిగా నష్టపోయి..జీవినోపాధి కోల్పోతామంటున్నారు. ప్రత్యామ్నాయంగా బతుకు లేక.. ఉపాధి కరువై ..ఏ భరోసా లేక సమూహికంగా ప్రాణాలు తీసుకుంటామని సోషల్ మీడియా ద్వారా గిరిజన మహిళలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపించాలని కోరుతున్నారు. దీనిపై నెటిజెన్లు సైతం తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Also Read: తెగ బిల్డప్ ఇచ్చారు.. రెండు రోజులకే తెగ బాధపడుతున్నారు