దేశంలో కరోనా మహమ్మారి గడిచిన ఏడు నెలలుగా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు వ్యాప్తి చెందిన వైరస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా పేరు వింటేనే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకసారి వైరస్ బారిన పడితే వైరస్ నుంచి కోలుకున్న తరువాత కూడా బాధితులు ఇబ్బందులు పడక తప్పదు.
Also Read : దుర్గగుడిలో మరో అపచారం..
శరీరంలోని ప్రధాన అవయవాలపై వైరస్ ప్రభావం పడుతుండటం వల్ల కొందరు కరోనా రోగులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కేంద్రం అన్ లాక్ అన్ లాక్ కు నిబంధనలను సడలిస్తోంది. అన్ లాక్ 5.0లో కేంద్రం పాఠశాలలు, కాలేజీలు తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాఠశాలలు తెరిస్తే విద్యార్థుల పరిస్థితేంటి..? విద్యార్థుల భవిష్యత్తేంటి..? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పాఠశాలల, కాలేజీల రీఓపెన్ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో కొందరికి ఆన్ లైన్ క్లాసులు నచ్చుతుంటే మరికొందరికి ఆన్ లైన్ క్లాసుల ద్వారా సమస్యలు ఎదురవుతున్నాయి. చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల్లో పాఠాలు అర్థం కావడం లేదని చెబుతున్నారు.
విద్యాసంస్థలు సైతం ఆన్ లైన్ క్లాసులు లేదా తరగతి గదుల్లో బోధనకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కేంద్రం పది సంవత్సరాలలోపు పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని చేసిన సూచన విద్యార్థులను మరింత గందరగోళంలోకి నెట్టేసింది. విద్యార్థులు పాఠశాలలకు వెళితే కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఆన్ లైన్ క్లాసులకే మొగ్గు చూపితే పాఠాలు సరిగ్గా అర్థం కావు. రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు వదిలేసిన నేపథ్యంలో విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళతాయో చూడాల్సి ఉంది.
Also Read : మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు