Homeట్రెండింగ్ న్యూస్Chandrayaan-3: చంద్రయాన్_3 పై టీవీ9 కు ఎందుకింత కక్ష

Chandrayaan-3: చంద్రయాన్_3 పై టీవీ9 కు ఎందుకింత కక్ష

Chandrayaan-3: చంద్రయాన్_ 3 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం ఇంకా పని మొదలు పెట్టలేదు. ఇంకా చంద్రుడి గుట్టు మట్లు తెలుసుకోలేదు. దానికి ఇంకా 37 రోజుల సమయం ఉంది. కానీ ఇంతలోనే టీవీ9 అక్కడికి చేరింది. చంద్రయాన్ 3 ఉపగ్రహానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది.. ఏంటిది చదువుతుంటే వింతగా అనిపిస్తోందా? సోయి ఉండే రాశారా? అనే అనుమానం కలుగుతోందా? మీ అనుమానం సరయిందే. మేము రాసినది కూడా సరైనదే. అదేంటి మీకు మీరే కవరింగ్ ఇచ్చుకుంటారేంటి? అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది.

అది తెలుసుకుంటే టీవీ9 ఎలా అవుతుంది?

సాధారణంగా ఎలక్ట్రాన్ మీడియా అనేది అప్పటికప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ ఉంటుంది. దృశ్య మాధ్యమం కాబట్టి సాధారణంగానే రీచ్ ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని స్పాట్ బేస్డ్ స్టోరీలకు వ్యుయర్ షిప్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వ్యూయర్ షిప్ ఎంత సంపాదించుకుంటే అన్ని ప్రకటనలు వస్తాయి. ప్రకటనలు వస్తే మేనేజ్మెంట్ కు లాభాల పంట పండుతుంది.. సాధారణంగా ఈ వ్యూయర్షిప్ సంపాదించుకునేందుకు చానల్స్ ఒకప్పుడు ఆరోగ్యకరమైన కంటెంట్ ప్రేక్షకులకు అందించేవి. కానీ రాను రాను అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాయి. మన తెలుగునాట ఈ పైత్యం కొంచెం ఎక్కువ.. దీనికి ఆజ్యం పోసింది టీవీ9. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జనం నవ్వుకున్నా, సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినా.. ఆ చానల్ ప్రయోగాలను మానివేయదు. ఆ ఛానల్ హెడ్స్ తమ పనితీరును మార్చుకోరు. చివరికి తమ నెంబర్ వన్ స్థానం కోల్పోయినప్పటికీ, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకుంటే అది టీవీ9 ఎలా అవుతుంది?

ఇంత అతి దేనికీ?

సాధారణంగా ఒక విషయాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, వారిని అటెన్షన్ మూడ్ లో ఉంచాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ప్రసారం చేసే కంటెంట్ లో నాణ్యత ఉండాలి. ఆ విషయానికి సంబంధించి లోతైన వివరాలు ఉండాలి.. కానీ అవేవీ లేకుండా కేవలం హంగామాకు మాత్రమే పరిమితమైపోతే దాన్ని ఏమనాలి? ఇంకేమంటాం టీవీ9 అని అంటాం. ఎందుకంటే ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగానికి సంబంధించి అంతర్జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు విశేషమైన కవరేజ్ ఇచ్చింది. మరి ఈ కవరేజీలో అన్ని చానల్స్ లాగా ఉంటే తన భిన్నత్వం ఏముంటుంది అనుకుందో తెలియదు కానీ టీవీ9 కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అదేంటయ్యా అంటే.. చంద్రగ్రహం లో టీవీ9 ప్రతినిధి ఉన్నట్టు.. ఆ ప్రయోగం గురించి కొంత మంది శాస్త్రవేత్తలతో చర్చావేదిక నిర్వహిస్తున్నట్టు.. ఒక డిజిటల్ వీఎఫ్ఎక్స్ వాతావరణాన్ని టీవీ9 క్రియేటివ్ టీం క్రియేట్ చేసింది. చూసేందుకు ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. పైగా ఆ టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ “మేము ముందుగానే చంద్ర గ్రహంలోకి వచ్చాము. చంద్రయాన్ 3 ఉపగ్రహానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని” తలా తోక లేకుండా వ్యాఖ్యలు చేశాడు. ఇది చూసిన ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. అంతేకాదు చంద్రయాన్ _3 ప్రయోగాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఏకంగా ఒక విఎఫ్ఎక్స్ థీమ్ ఏర్పాటు చేశారు. దీంతో ఇతర సంఘటనలు జరిగితే కూడా ఇలానే చేస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. టీవీ9 ప్రయోగాలు చేయకుంటే వార్త అవుతుంది. అదే ప్రయోగాలు చేస్తే అభాసు పాలవుతుందని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో టీవీ9 చంద్రయాన్_3 ప్రయోగం సందర్భంగా చేసిన అతిని.. మీమ్స్ రూపంలో క్రియేట్ చేసి టీవీ9 చేస్తున్న తప్పు ఏంటో తెలియజేస్తున్నారు. అయినా వారి పిచ్చి గాని… టీవీ 9 ఇవన్నీ చాలా చూసి ఉంటుంది..లైట్ తీసుకొని ఉంటుంది.. అయినా ప్రయోగం చేయడం అనేది టీవీ9 యాజమాన్యం ఇష్టం. చూడటమా? చూడకపోవటమా? అనేది తెలుగు ప్రేక్షకుల ఇష్టం. మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం, మీరు చూడండి అంటూ టీవీ 9 బతిమిలాటం లేదు కదా! అంతేలే భయ్యా.. కొన్నింటికి ఎర్రగడ్డలో కూడా మందు దొరకదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular