
Prakash Raj- Krishna Vamsi: విలక్షణ నటుడిగా పేరున్న ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ కు ఎవరూ వంక పెట్టరు. సినిమాలో ఆయన ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఇమిడిపోతారు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా ప్రకాశ్ రాజ్ పలు చిత్రాలు తీసి మెప్పించాడు. ఆయన మదిలో నుంచి వచ్చిన ‘ధోని’, ‘ఉలువచారు బిర్యాని’ సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ సినిమాల్లో కథా బలమే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ప్రకాశ్ రాజ్ మంచి రైటర్ అని కూడా అర్థమైంది. అంతేకాకుండా కథలను ఎంపిక చేయడంలో ఆయన దిట్ట. మరాఠీలో ‘నట సామ్రాట్ ’ అనే సినిమా సంచలన విజయం సాధించింది. దీని తెలుగు రైట్స్ ను ప్రకాశ్ రాజ్ కొనుగోలు చేశారు. ఒక డైరెక్టర్ గా ప్రకాశ్ రాజ్ ఈ సినిమాను తీయొచ్చు. కానీ కృష్ణ వంశీతో సినిమా తీయడానికి కారణమేంటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
‘రంగ మార్తాండ’ సినిమాలో ప్రకాశ్ రాజ్ మెయిన్ రోల్ లో నటించారు. ఇందులో ఆయన రంగస్థల నటుడిగా కనిపించారు. ఆ తరువాత రిటైరై ఎలాంటి ఇబ్బందులు పడుతారోనన్న పాత్రలో ప్రకాశ్ లీనమైపోతారు. ఈ తరుణంలో మానవ విలువల గురించి వివరించే ఆయన నటనను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఇలా ఉండాలని ప్రకాశ్ రాజ్ ముందే డిసైడ్ చేశారట. కథ తనకు ముందే తెలుసు కాబట్టి ప్రకాశ్ రాజ్ ఆ పాత్రలో జివించారు. దీంతో ఆ పాత్రకు బలం చేకూరింది. కానీ డైరెక్షన్ బాధ్యతలు కృష్ణ వంశీకి అప్పజెప్పారు. దానికి ఆయన చెప్పిన మాటలను పరిశీలిద్దాం.

ఈ విషయాన్ని ఓ మీడియా ప్రతినిధులు అడిగారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ తానొక డైరెక్టర్ అయినా ‘రంగమార్తాండ’ ను తెరపై చూపించే నైపుణ్యం తన దగ్గర లేదన్నారు. కృష్ణ వంశీకి, తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. తెలుగు చరిత్రను చక్కగా చూపించడంలో కృష్ణవంశీకి పట్టు ఉందని అన్నారు. ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసింది వాస్తవమే. కానీ తాను డైరెక్షన్ చేస్తూనే నటుడిగా ఇన్వాల్వ్ అవడం వల్ల అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేకపోతుంది. అందుకే కృష్ణవంశీకి ఈ కథను అందించాను. అనుకున్నట్లే సినిమా సక్సెస్ అయి సంతృప్తినిచ్చిందని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఇక ‘రంగ మార్తాండ’ సినిమాలో ప్రకాశ్ రాజ్ కు జోడిగా రమ్యకృష్ణ నటించారు. అలాగే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఇందులో కీలకంగా నటించారు. ఈ సినిమా మొత్తం సీనియర్ నటులే ఎక్కువగా కనిపించడం విశేషం. ఇందులో ప్రకాశ్ రాజ్ రంగస్థల నటుడిగా ఆకట్టుకుంటారు. నాటక రంగాన్ని ప్రస్తావిస్తూ కుటుంబ విలువలు చూపించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.