Chiranjeevi: చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లో ఆయనపై విషప్రయోగం జరిగిందనే వాదన ఉంది. 1988లో జరిగిన ఈ సంఘటనను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. సమాచార విప్లవం అంతగా లేని రోజులు కావడంతో అది జనాల్లోకి వెళ్ళలేదు. అంచెలంచెలుగా ఎదుగుతున్న చిరంజీవిని చంపేందుకు ప్రత్యర్థులు ఈ కుట్ర పన్నారని కొందరు అన్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి చిరంజీవి తాజాగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా చిరంజీవి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

చిరంజీవి మాట్లాడుతూ… నా అభిమాని స్వయంగా నా మీద విష ప్రయోగం చేశాడు. మరణమృదంగా షూటింగ్ జరుగుతుండగా సెట్స్ లో కేక్ కట్ చేశాము. అభిమాని ఒకరు కేక్ తన చేత్తో స్వయంగా నాకు తినిపించాడు. నాకు కూడా స్పూన్ తో తినే అలవాటు లేదు. ఈ కారణంగా అభిమాని చేత్తో కేక్ పెడుతున్నా… కాదనకుండా నేను నోట్లో పెట్టుకున్నాను. అయితే అది చేదుగా అనిపించింది. నేను బయటకు ఊసేశాను.
అక్కడే ఉన్న మరణమృదంగం ప్రొడ్యూసర్ కే ఎస్ రామారావు అతన్ని పట్టుకున్నాడు. తర్వాత కేక్ టెస్టింగ్ కి పంపించాము. ఏదో కలిపినట్లు నిర్ధారణ అయ్యింది. కే ఎస్ రామారావు అతన్ని కొట్టి గట్టిగా ప్రశ్నించారు. దాంతో నిజం ఒప్పుకున్నాడు. చిరంజీవి నాతో సరిగా మాట్లాడటం లేదు. అందుకే ఈ పని చేశాను. కేరళ నుండి వశీకరణ మందు తెచ్చాను. అదే చిరంజీవికి తినిపించాలనుకున్నాను, అని సదరు అభిమాని చెప్పాడు. ఆ మాటలు విన్న నేను షాక్ కి గురయ్యాను. అతన్ని ఏమీ చేయకుండా వదిలేయమని చెప్పాను, అని చిరంజీవి వివరించారు.

వాల్తేరు వీరయ్య మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి ఈ విష ప్రయోగ సంఘటన గురించి ఏనాడూ మాట్లాడింది లేదు. గతంలో ఎప్పుడైనా చెప్పారేమో కానీ ఈ మధ్య కాలంలో చిరంజీవి ఈ ప్రస్తావన తేలేదు. ఇక జనవరి 13న వాల్తేరు వీరయ్య గ్రాండ్ గా విడుదల కానుంది. 12వ తేదీ అర్ధరాత్రి నుండే యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. వీరసింహారెడ్డి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వాల్తేరు వీరయ్య ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా… సంక్రాంతి విన్నర్ అవుతుంది. ఈ చిత్రాన్ని కే ఎస్ రవీంద్ర తెరకెక్కించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. రవితేజ కీలక రోల్ చేశారు. దేవిశ్రీ సంగీతం అందించారు.