Mahanati Savitri : వెండితెరపై ధ్రువతారగా వెలిగిన సావిత్రి జీవితం ముగిసిన తీరు, ఆమె అశేష అభిమానులను వెంటాడే చేదు జ్ఞాపకం. సిరి సంపదల నడుమ మహారాణిగా బ్రతికిన సావిత్రి అనాధగా ఆదరణ కరువై కన్నుమూశారు. ఎన్టీఆర్, ఏన్నార్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సావిత్రి ఆరోజుల్లోనే కోట్లు కూడబెట్టారు. విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. అరుదైన నగలు సేకరించారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఆమె పతనానికి కారణమయ్యాయి. మనుషుల్ని గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోయారు.
ఈ విషయాలను ఆమె బయోపిక్ మహానటి చిత్రంలో చూపించారు. ఒక అనాథగా సావిత్రి వద్ద చేరి, తర్వాత ఆమెనే మోసం చేసే సత్యం క్యారెక్టర్ మహానటి మూవీలో మనం చూడవచ్చు. జబర్దస్త్ ఫేమ్ మహేష్ ఆచంట ఆ రోల్ చేశాడు. నిజజీవితంలో సత్యం పాత్ర ఎవరిని ఉద్దేశించి పెట్టారో? సావిత్రిని మోసం చేసి ఆమె సంపద కాజేసిన వారెవరో? కూతురు విజయ చాముండేశ్వరి వెల్లడించారు.
నిజానికి సావిత్రి జీవితంలో సత్యం అనే వ్యక్తి లేరు. ఆమె వద్ద చాకలి వ్యక్తి ఒకరు పనిచేసేవారు. అయితే అతడు నమ్మిన బంటు. చాలా మంచి వ్యక్తి. సావిత్రి మేనేజర్ తో పాటు పని వాళ్ళు కొందరు కలిసి సావిత్రిని మోసం చేశారు. ఆ నలుగురు వ్యక్తులను ప్రతిబించేలా సత్యం అనే ఒక ఊహాజనిత పాత్ర క్రియేట్ చేసి సావిత్రిని నమ్మిన వాళ్లు ఎలా మోసం చేశారో చూపించారు. సావిత్రి డబ్బులు కాజేసినవారు ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. చెన్నైలో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని విజయ చాముండేశ్వరి తెలియజేశారు.
దర్శకుడు నాగ అశ్విన్ మహానటి చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించారు. చాలా వరకు సావిత్రి వాస్తవ జీవితాన్ని ఆవిష్కరించారు. సావిత్రి పాత్ర చేసే అదృష్టం కీర్తి సురేష్ కి దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కీర్తి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. నిజంగా సావిత్రి ఆమెను పూనిందేమో అన్నట్లు కీర్తి నటన సాగింది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన మహానటి ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. కీర్తి ఈ చిత్రంతో జాతీయ అవార్డు అందుకుంది.