
Pawan Kalyan Varahi Yatra: ఏపీలో యాత్రల రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే ఒకనేత పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి తిరుగుతున్నారు. మరోనేత వారాహి యాత్రకు సమాయత్తం అవుతున్నారు. నేరుగా జనంతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. జనం ఈతిబాధలను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. జనం భుజంతో భుజం కలిపి.. వారి అడుగులో అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలి ? సరైన సమయం ఏది ? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర త్వరలో ప్రారంభంకానుంది. ఏపీ మొత్తం తిరిగేందుకు జనసేనాని సమాయత్తం అవుతున్నారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. ఏపీలో మార్పు సాధించడం కోసం ప్రతిన బూనారు. పవన్ కళ్యాణ్ యాత్ర ప్రకటనతో అధికార పార్టీలో వణుకుపుట్టింది. వారాహి యాత్రను అడ్డుకుంటామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికింది. చివరికి నాలుక మడతేసింది. మేం అలా అనలేందంటూ తప్పించుకుంది. అధికార పార్టీ మాటలను చూస్తే వారాహి అంటే ఎంత భయమో ఇట్టే అర్థమవుతుంది.
ఏపీలో నారా లోకేష్ ఇప్పటికే పాదయాత్ర మొదలు పెట్టారు. జనంలో తిరుగుతున్నారు. అధికార పార్టీ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ కూడా పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెడుతోంది. పాదయాత్రకు ఎక్కడికక్కడ ఆటంకాలు కలిగిస్తోంది. లోకేష్ పాదయాత్రకు జనం వస్తున్నా.. అనుకున్న స్థాయిలో వచ్చినట్టు కనిపించడంలేదు. ఎక్కువగా టీడీపీ కార్యకర్తలే యాత్రలో కనిపిస్తున్నారు. కానీ సామాన్యం జనం నుంచి పెద్దగా స్పందన వచ్చినట్టు కనిపించడంలేదు. దీనికి కారణం టీడీపీ ఇప్పటికే అధికారంలో ఉండటం. చంద్రబాబు పాలను అనేకసార్లు ప్రజలు చూడటం అని చెప్పవచ్చు. కొత్తగా లోకేష్ ఇస్తున్న హామీలు కూడా ఏమీ కనిపించడంలేదు.

లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉన్న సమయంలో .. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించిన చర్చ జోరందుకుంది. వారాహి త్వరలో ప్రజల్లోకి రానుంది. లోకేష్ పాదయాత్ర తరహాలో వారాహి యాత్రకు పెద్దగా స్పందన లేకపోతే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి పవన్ కల్యాణ్ ఆచితూచి అడుగువేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ? అన్న అంశం పై అధ్యయనం చేయాలి. అప్పుడు ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వాలన్న స్పష్టత వస్తుంది. తద్వార ప్రజల మనసులను గెలుచుకునే అవకాశం ఉంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో పవన్ కళ్యాణ్ కు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల మూడ్ ఏంటనేది అర్థమవుతుంది. దీంతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి ? ఎలాంటి హామీలు ఇవ్వాలి ? ప‌్రజల మద్దతు ఎలా పొందాలి ? అన్న విషయంలో స్పష్టత వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లడం మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ కు భిన్నంగా మెరుగ్గా ఏం చేస్తామో పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. అప్పుడే వారాహి యాత్ర అనుకున్నట్టు విజయం సాధిస్తుంది.
