
Bandi Sanjay Satires On KCR: ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ సభ ముగిసిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రధాని కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. ప్రధాని పర్యటనకంటే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకంటే ముఖ్యమైన షెడ్యూల్ ఏముందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
ప్రధానితో సన్మానిద్దామనుకున్నా..
సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కార్యక్రమాలకు హాజరైతే ప్రధానితోనే సన్మానించడంతోపాటు, తాను కూడా సన్మానించాలనుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్‌కు సన్మానం చేసేందుకు శాలువా కూడా తీసుకువచ్చానని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం సభా వేదికపై కుర్చీ కూడా వేయించామని పేర్కొన్నారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రారని ప్రశ్నించారు.
అభివృద్ధికి కేసీఆరే అడ్డంకి..
తెలంగాణ అభివృద్ధికి కేసీఆరే అడ్డం పడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావడానికి ప్రధాని మోదీ, రైల్వే మంత్రి, పర్యాటకశాఖ మంత్రితోపాటు బీజేపీ నాయకులంతా హాజరయ్యారని తెలిపారు. తెలంగాణ సీఎం మాత్రం రాలేదని విమర్శించారు. ఇప్పుడు దీనికి జ్వరం వచ్చిందని అంటారా? కోవిడ్ వచ్చిందని అంటారా? అని సంజయ్ ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి కారణం ఏంటో తెలంగాణ ప్రజానీకానికి చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ అభివద్ధికి కేంద్రం సహకారం..
కేసీఆర్ కుటుంబం, నియంత, అవినీతి పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్రం మాత్రం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే సహకరించడం లేదని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని ప్రశి‍్నంచే అవకాశాన్ని కేసీఆర్ కోల్పోయారని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ సభను విజయవంతం చేసిన బీజేపీ శ్రేణులు, ప్రజలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలావుంటే, బహిరంగ సభలో ప్రధాని మోడీ తెలంగాణ సర్కారుపై కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతీ ప్రాజెక్టు కూడా అవినీతితో ఆలస్యం అవుతోందని ఆరోపించారు. కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలకాలని పిలుపునిచ్చారు. కుటుంబం పాలన, అవినీతి వేర్వేరు కాదంటూనే.. ఇలాంటి వారిపై పోరాడాలా వద్దా అని ప్రజలను ప్రశ్నించారు.