Monkey: ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభుగా వెలిశాడు. అందువల్లే స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. పైగా ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడకు కొండగట్టు దగ్గర్లోనే ఉంటుంది. అందువల్ల భక్తులు రాజన్నను దర్శించుకున్న తర్వాత ఆంజనేయస్వామి క్షేత్రానికి వెళ్తుంటారు. అక్కడ స్వామివారి ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి.. కొబ్బరికాయలు కొడుతుంటారు. ఇక్కడి అంజన్న అత్యంత శక్తివంతుడని భక్తులు నమ్ముతుంటారు. అందువల్లే ఈ క్షేత్రానికి విశేషమైన పేరు వచ్చింది.. అయితే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన ఓ భక్తుడికి వింత అనుభవం ఎదురయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఓ భక్తుడు వెళ్ళాడు. అతడి చేతిలో సెల్ఫోన్ ఉంది. మరో చేతిలో బ్యాగు ఉంది. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ వానరం ఆ భక్తుడి బ్యాగ్, సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళింది. ఆ భక్తుడు వెంటపడినప్పటికీ వానరం ఏమాత్రం కనికరం చూపించలేదు. పైగా ఆలయ గోపురం పైభాగానికి ఎక్కింది. ఆ బ్యాగు, సెల్ఫోన్ కోసం ఆ భక్తుడు నానా దండాలు పడ్డాడు. అది ఇవ్వకుండా ఆ వానరం ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి ఒక పులిహోర ప్యాకెట్ ఇవ్వగా బ్యాగ్ ను వదిలిపెట్టింది. కానీ సెల్ ఫోన్ మాత్రం అస్సలు ఇవ్వలేదు. దీంతో మరింత హైరానాపడిన ఆ భక్తుడు సెల్ఫోన్ కోసం నానా ఇబ్బందులు పడ్డాడు . చివరికి ఆ ఫోన్ ను గోపురం పైభాగంలో పెట్టింది. దీంతో ఆ భక్తుడు అతి కష్టం మీద ఆ గోపురం ఎక్కి తన ఫోన్ దక్కించుకున్నాడు. అనంతరం కిందికి వచ్చి బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయాడు. స్వామివారి దర్శనం కోసం వస్తే వానరం చుక్కలు చూపించింది అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.. అయితే కొండగట్టు ప్రాంతంలో కోతులు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతంలో మైనింగ్ జోరుగా సాగుతుండడంతో కోతులు కొండగట్టు మీదకు చేరుతున్నాయి. గతంలో ఇక్కడ కోతులు అంతగా ఉండేవి కావు. కానీ ఇటీవల వాటి సంఖ్య పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల చేతిలో కొబ్బరికాయలు తీసుకోవడం.. పులిహోర ప్యాకెట్లు లాక్కోవడం.. అప్పుడప్పుడు దాడులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి..భక్తుల మీద దాడులు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న పొలాలను కూడా కోతులు నాశనం చేస్తున్నాయి. కోతుల దాడి నుంచి తప్పించుకోవడానికి రైతులు కుక్కలను పెంచుకుంటున్నారు.. తమ పొలాల చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయనప్పటికీ కోతుల బెడద ఏమాత్రం తగ్గడం లేదు.