Fan Directed : సిల్వర్ స్క్రీన్ పై అభిమాన హీరోని చూస్తుంటే ఆటోమేటిక్ గా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆయన చొక్కా మడతెట్టినా, రౌడీలను చితక్కొట్టినా మనమే కొడుతున్నట్లు ఫీలైపోతాం. మన హీరో చెప్పిన డైలాగ్స్ బట్టీ పట్టేస్తాం. ఫ్రెండ్స్ ముందు ఊదరగొట్టేస్తాం. ఆయన వేసుకున్న బట్టల నుండి కదిపే కాలు వరకు కాపీ కొట్టేస్తాం. ఒక ఫ్యాన్ బాయ్ గా నచ్చిన హీరోని ఆరాధ్య దైవంగా పూజిస్తాం. అలాంటి డై హార్ట్ ఫ్యాన్ డైరెక్టర్ అయితే… ఏకంగా అభిమాన హీరో మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే రచ్చ రంబోలానే. థియేటర్లో కూర్చుని మూవీ చూస్తున్నప్పుడు మన హీరోని ఎలా చూడాలనుకున్నామో చూపించేస్తాం. మన ఊహలకు పదునుపెట్టి మరింత అద్భుతంగా ఆవిష్కరిస్తాం. చాలా మంది ఫ్యాన్ బాయ్స్ తమ అభిమాన హీరోలను డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. వారెవరో… ఆ సినిమాలు ఏమిటో చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవికి కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైహార్డ్ ఫ్యాన్స్. అభిమాన సంఘాలలో కీలక పాత్ర వహించిన కే ఎస్ రవీంద్ర చిరంజీవికి వాల్తేరు వీరయ్య రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. 2023 సంక్రాంతి విన్నర్ ని చేశారు. మెగా ఫ్యాన్స్ అంచనాలకు రెండింతల అనుభూతి ఇచ్చారు.
2012 లో విడుదలైన గబ్బర్ సింగ్ టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఆ చిత్రాన్ని పవన్ అభిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. పవన్ ని హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసినంత గొప్పగా మరో దర్శకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆ మూవీలో పవన్ మేనరిజమ్స్, వన్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి.
దశాబ్దాల తర్వాత కమర్షియల్ హిట్ కొట్టారు కమల్ హాసన్. ఆయనకు ఎవరూ ఇవ్వలేని హిట్ ఫ్యాన్ బాయ్ లోకేష్ కనకరాజ్ ఇచ్చారు. గత ఏడాది విడుదలైన విక్రమ్ వందల కోట్ల వసూళ్లతో సౌత్ ఇండియా రికార్డ్స్ తిరగరాసింది.
దర్శకుడు పూరి జగన్నాధ్ సైతం పవన్ కళ్యాణ్ అభిమాని. వీరి కాంబోలో వచ్చిన బద్రి సూపర్ హిట్. ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో కూడా పవన్ మాస్ మేనరిజమ్స్ డెవలప్ చేసి ఫ్యాన్స్ కోరుకునే విధంగా పూరి ఆవిష్కరించారు. ఆ సినిమాలో పవన్ కోసం పూరి రాసిన ‘నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్’ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్.
మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు వివి వినాయక్. ఆయన చిరంజీవి వీరాభిమాని. ఆయన దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఠాగూర్,ఖైదీ నెంబర్ 150 ఇండస్ట్రీ హిట్ కొట్టాయి.
ఇండియన్ సినిమాకు భారీతనాన్ని పరిచయం ఘనత దర్శకుడు శంకర్ ది. ఆయన రజినీకాంత్ డై హార్డ్ ఫ్యాన్. వీరి కాంబినేషన్ లో మొదటిగా వచ్చిన శివాజీ సూపర్ హిట్. రోబో, 2.0 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి.
దర్శకుడు బోయపాటి శ్రీనుకి మించిన అభిమాని బహుశా బాలయ్యకు ఉండరేమో. నటసింహం బాలయ్యను ప్రేక్షకులు మెచ్చేలా వెండితెరపై ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వీరి కాంబోలో విడుదలైన సింహ, లెజెండ్, అఖండ కోట్లు కొల్లగొట్టాయి.
యంగ్ డైరెక్టర్ అట్లీ తలపతి విజయ్ కి వీరాభిమాని. అభిమాన హీరోకి అట్లీ మరపురాని విజయాలు అందించారు. విజయ్ మార్కెట్ విస్తరించడంలో అట్లీ డైరెక్ట్ చేసిన తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలు చాలా దోహదపడ్డాయి.
దర్శకుడు హెచ్ వినోత్ కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ అంటే పడిచస్తారు. తన ఫ్యాన్ బాయ్ కి అజిత్ కుమార్ వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని కోల్పోకుండా వినోత్ సూపర్ హిట్స్ ఇస్తున్నారు. నెర్కొండపార్వై, తునివు మంచి విజయాలు నమోదు చేశాయి.