
CM Jagan On Visakha Capital: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధాను అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. విశాఖే పరిపాలన రాజధాని అని అన్నారు. త్వరలో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ సంతబొమ్మాళిలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేశారు. హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపనలు చేశారు. అనంతరం నౌపలో నిర్వహించిన బహిరంగ సభలో పలు కీలక అంశాలను వెల్లడించారు.

మూలపేట రేపురేఖలు మార్చేస్తానని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 24 నెలల్లో మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. అనుబంధ పరిశ్రమల వల్ల మరికొంత మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో మూలపేటకు 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టునున్నట్లు జగన్ అన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో మూడు రాజధానుల అంశంపైనే కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతుంది. సెప్టెంబరు నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే, గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు, మద్దతు పలికి ఆయన తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత నాలుక మడతేసిన ఆయన ఇప్పుడు విశాఖకు వలస వెళ్తానని అనడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.