Viral News : ఇంటర్నెట్ ప్రపంచంలో నిరంతరం ఏదో ఒక కొత్త ఛాలెంజ్ హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. లైక్‌లు, వ్యూస్ కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక వింత, భయానకమైన ట్రెండ్ వైరల్ అవుతోంది. అదేంటంటే, కొందరు స్టూడెంట్స్ సరదా కోసం ఏకంగా తమ ల్యాప్‌టాప్‌లకే నిప్పు పెడుతున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అసలు ఈ వింత ట్రెండ్ ఏమిటి? వాళ్లెందుకు ఇలా చేస్తున్నారు? తెలుసుకుందాం.
ఈ కొత్త ఛాలెంజ్‌కి #క్రోమ్‌బుక్‌ఛాలెంజ్ (#ChromebookChallange) అని పేరు పెట్టారు. ఇందులో పిల్లలు తమ ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పోర్ట్‌లో కాస్త కాగితం ముక్కో, పెన్సిల్ పొడినో లేదా ఫాయిల్ పేపర్‌నో పెడుతున్నారు. అంతే! ల్యాప్‌టాప్‌లో, ముఖ్యంగా ఛార్జర్‌లో షార్ట్ సర్క్యూట్ అయిపోతోంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ అవ్వగానే ల్యాప్‌టాప్‌లోంచి మంటలు, విషపూరితమైన పొగలు వస్తున్నాయి.
ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?
మీడియా కథనాల ప్రకారం.. అమెరికాలోని కనెక్టికట్‌లోని న్యూయింగ్‌టన్ హైస్కూల్‌లో ఇలాంటి ఒక ఛాలెంజ్ వల్ల క్లాస్‌రూమ్ మొత్తం పొగతో నిండిపోయింది. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం..అక్కడి ఫైర్ మార్షల్ డిజె జోర్డాన్ చెప్పింది ఏంటంటే ఈ ట్రెండ్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ల్యాప్‌టాప్ బ్యాటరీలు చాలా తొందరగా మంటను అంటుకుంటాయి. ఒకసారి కాలిపోతే వాటి నుంచి వచ్చే పొగ చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ఫైర్ బ్రిగేడ్‌ను కూడా పిలవాల్సి వస్తోంది.
అమెరికాలోని కాలిఫోర్నియా, కరోలినా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్, విస్కాన్సిన్, వాషింగ్టన్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. టిక్‌టాక్ లెక్కల ప్రకారం, గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య దాదాపు 99.7 శాతం ప్రమాదకరమైన కంటెంట్‌ను వాళ్లు తీసేశారు. కానీ, ఇలాంటి చెత్తంతా సోషల్ మీడియాలో వైరల్ కాకూడదని, దీనివల్ల యూత్‌కు చాలా నష్టం జరుగుతుందని చాలా మంది ఇప్పటికీ అంటున్నారు.