
Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సడెన్ గా మౌన ముని ఎందుకైనట్టు? ఆయనలో ఆ మార్పునకు కారణమేంటి? ప్రత్యర్థులపై నీచాతి నీచమైన ట్విట్లు, కామెంట్లు పెడతారన్న ఆరోపణలున్న ఆయనలో చేంజ్ కి అసలు కారణాలున్నాయా? ఎందుకు ఆయన సైలెంట్ అయినట్టు? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో నంబర్ 2 గా ఎదిగిన నాయకుడు ఇంతలా గొంతు సవరించుకోవడానికి కారణాలేంటనేదానిపై వైసీపీ శ్రేణులు సైతం ఆరాతీస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డిది మల్టీ టాస్క్. పార్టీ అనుబంధ విభాగాల నుంచి ఢిల్లీలో పార్టీ వ్యవహారాల వరకూ ఆయన కనుసన్నల్లో నడిచేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మునుపటిలా ఆయన పార్టీ వ్యవహారాల్లో కనిపించడం లేదు. అటు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా తొంగి చూడడం లేదు. దీంతో ఏదో జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే విపక్ష నాయకులకు ఆశ్చర్యం కలిగించేలా విజయసాయిరెడ్డి వ్యవహారం నడుస్తోంది. ఆయన కర్త, ఖర్మ, క్రియ వైసీపీయే. సర్వస్వం జగనే. ఈ నేపథ్యంలో ఆయన కిందా మీదా చూడలేదు. చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా వ్యవహరించారు. కానీ ఇటీవల కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది. తన వైపు మితిమీరిన అభిమానమే కానీ.. అటు నుంచి ఆ స్థాయిలో లేదని గుర్తించారు. దీంతో స్ట్రాటజీ మార్చుకున్నారన్న టాక్ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి ఎత్తూపల్లాలు చూడడం ప్రారంభించారు. ఒకానొక దశలో కుటుంబసభ్యులు, వైఎస్ అనుంగ నాయకులు అసూయపడే రీతిలో జగన్ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యమిచ్చారు. ఏకంగా ఉత్తరాంధ్రనే ఆయన చేతిలో పెట్టేశారు. అక్కడ సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి హేమాహేమీలున్నా ఉత్తరాంధ్రలో చీమ చిటిక్కుమనాలన్నా విజయసాయిరెడ్డి అనుమతితోనేనంత తతంగం నడిపించారు. కానీ జగన్ విజయసాయిరెడ్డిని తప్పించారు. తన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టేశారు.
అక్కడ నుంచి విజయసాయిరెడ్డిని పార్టీలో కుదురుగా కూర్చోనివ్వడం లేదు. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష బాధ్యతల్ని విజయసాయిరెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి, తోడుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని కూడా ఆయనకు అటాచ్ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను చెవిరెడ్డే ప్రకటించడం చర్చనీయాంశమైంది. బహుశా పూర్తిగా విజయసాయిరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించకపోవడం వల్లే ఆయన మౌనాన్ని ఆశ్రయించారని సమాచారం. వైసీపీ కార్యకలాపాలకు విజయసాయిరెడ్డి దూరంగా ఉండడం, అలాగే ప్రత్యర్థులపై గతంలో మాదిరిగా హాట్ కామెంట్స్ చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

అయితే ఇటీవల జరిగిన పరిణామాలు మాత్రం విజయసాయిరెడ్డిలో వచ్చిన మార్పున స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తన సమీప బంధువు తారకరత్న ఆరోగ్యం బాగాలేనప్పటినుంచి మొన్నటి అంత్యక్రియల వరకూ ఆయన వ్యవహార శైలి, చేసిన వ్యాఖ్యలు వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ ని కొంత దూరం చేశాయి. ఆస్పత్రి వద్ద బాలక్రిష్ణను పొగడడం, చంద్రబాబు పక్కనే కూర్చొని మాట్లాడడం, తరువాత విలేఖర్ల తోమాట్లాడినప్పుడు ఆయన వెన్నంటే ఉండడం, జూనియర్ ఎన్టీఆర్, బాలక్రిష్ణతో చర్చలు జరపడం ఒకరకమైన భిన్న వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అయితే వాటి తరువాత పరిణామాలు విజయసాయిరెడ్డికి తెలియని కావు. అందుకే హైకమాండ్ కు ఏదో సంకేతాలు పంపించాలన్న భాగంలోనే ఆయన ప్రవర్తన మారింది. అయితే గత మూడు నెలలుగా ఆయనలో చేంజ్ కనిపిస్తోంది. ట్విట్టర్ ఖాతా ద్వార రాజకీయ ప్రత్యర్థులను సైతం శుభాకాంక్షలు తెలపడం వంటివి చేస్తున్నారు. సహజంగా ఇవి అందరి నాయకులు చేసినవే. కానీ విజయసాయిరెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం అవి కొత్తగా ఉన్నాయి. వైసీపీకి అనుమానం కలిగించేలా, హెచ్చరించేలా ఉన్నాయి.