VijayDevarakonda: బాహుబలి,పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో దేశమంతా తెలుగు సినిమా అంటే గొప్ప గౌరవం పెరిగింది. రాజమౌళి సహా మన దర్శకుల ప్రతిభకు హిందీ జనాలు ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా తెలుగు సినిమాను గొప్పగా చూస్తున్నారు. మన నటీనటులను అందలం ఎక్కిస్తున్నారు. అంతలా ఖ్యాతి పొందిన తెలుగు సినిమా పరువును ‘లైగర్’తో విజయ్ దేవరకొండ పరువు తీస్తున్నాడని పలువురు ఆడిపోసుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ ఆది నుంచి ఆటిట్యూడ్ చూపిస్తుంటారు. ఓ ఫంక్షన్ లో స్టార్ హీరో మహేష్ ను పట్టుకొని గౌరవం లేకుండా పేరు పెట్టి ‘మహేష్’ అన్నాడు. ఇంకో ఫంక్షన్ కు నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి పరువు తీశాడు. ఇక హిందీ ప్రమోషన్స్ లో చిన్న షార్ట్ వేసుకొని తొడలు కనపడేలా చూపించాడు. ఏంది ఇదంతా అంటే ఇదొక స్టైల్ అంటూ చెబుతాడు. కానీ వెగటు పుట్టించేలా ఉండే ఇది ఒక స్టైల్ అని అప్పట్లోనే కొందరు విమర్శించారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది సామెత. అలా ఒదిగి ఉన్నప్పుడే మన కష్టానికి ఫలితం దక్కుతుంది. ఒక సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లాంటి వారు ఎంత ఎదిగినా ఇప్పటికీ సింప్లిసిటీగా ఉంటారు. భావోద్వేగానికి గురికారు. ఎందరో కెప్టెన్లు మారినా.. దశాబ్ధాలు గడిచినా దక్కని ప్రపంచకప్ ను ధోని లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి అందిస్తే క్రికెటర్లు అందరూ ఏడ్చేశారు. కానీ ధోని మాత్రం నిబ్బరంగా నిలబడ్డాడు. అంతటి కర్మ యోగి తత్వం ఉండాలంటారు. కానీ ఇప్పుడు వర్ధమాన హీరోలకు అదే కరువైందన్న కామెంట్స్ వినపడుతున్నాయి..
విజయ్ దేవరకొండ ఆటిట్యూట్ గురించి ఇప్పుడు అందరూ కామెంట్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, గీతాగోవిందం లాంటి రెండు మూడు హిట్స్ దక్కగానే విజయ్ లో పొగరు పెరిగిపోయిందంటారు. ఇప్పుడు ‘లైగర్’తో ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ వేళ ఆ పొగరు ఇంకాస్త ఎక్కువైందని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో లైగర్ ప్రమోషన్ లో విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరు ఇప్పటికీ వివాదాస్పదంగానే కొనసాగుతోంది. రెండు కాళ్లు పైకి ఎత్తి ముందు టేబుల్ పై పెట్టి పొగరుగా జర్నలిస్టుల ముందు సమాధానాలు ఇచ్చాడని అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు..
విషయం ఉన్నోడు… వినయంగా ఉంటాడని.. వినయంగా ఉన్నోడు విజేతగా మారుతాడని ఆ ఫొటోపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని లోపాలు, ఎన్ని విమర్శలు ఉన్నా… చిరంజీవి, వెంకటేష్ సినిమాలకు క్రేజ్ ఇప్పటికీ తగ్గకపోవడానికి పనిపట్ల వారికి ఉండే హుందాతనమే కారణమంటున్నారు. రెండు మూడు హిట్స్ కే విజయ్ దేవరకొండ ఇంతలా యాటిట్యూట్ చూపించడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.
చివరగా… ఇలాంటి హీరోలకు రెండు భారీ ప్లాప్స్ వస్తే చాలు నెత్తికి ఎక్కిన తిక్క అంతా దిగిపోయి మళ్లీ నేలమీదకు వస్తారని కామెంట్స్ చేస్తారు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడకి చేరడానికి ఫ్లాపులు చాలంటూ ఎద్దేవా చేస్తున్నారు.
హైదరాబాద్ ప్రెస్ మీట్ లో తాను కాళ్లు టేబుల్ మీద పెట్టి మాట్లాడడం వివాదం కావడంతో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించారు. ఆ వీడియోను రిలీజ్ చేసి మరీ తాను తప్పు చేయలేదని..కేవలం విలేకరులకు సరదాగా మాట్లాడడానికి చేసిన ప్రయత్నం అని కవర్ చేశారు. ‘ప్యాన్ ఇండియా హీరో అయితే దూరం పెరుగుతుందా? ’అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి విజయ్ ‘ అవన్నీ ఏం లేవని.. సరదాగా మాట్లాడుకుందామని.. మీరు కాలు మీద కాలేసుకొని కూర్చోండి. నేనూ కాలు మీద కాలేసుకొని కూర్చుంటా’ అని ఫ్లెండ్లీగానే విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనే కాళ్లు పైకి ఎత్తి విజయ్ మాట్లాడాడు తప్పితే విజయ్ చేసిన తప్పు లేదని అంటున్నారు.
కానీ ఆ ఒక్క ఫొటో విజయ్ ను చాలా డ్యామేజ్ చేసింది.అతడికి పొగరు అన్న లెవల్ లో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యింది. దీని దెబ్బకు అసలు విషయం ఇదీ అని విజయ్ దేవరకొండ వీడియో షేర్ చేసి మరీ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పటికైనా తెలుగు సినీ ఇండస్ట్రీ పరువును ఇతర భాషల్లో ప్రాంతాలకు ప్రమోషన్ కు వెళ్లినప్పుడు విజయ్ తీయకుండా ఉంటే అదే పదివేలు అని పలువురు హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా ఆ యాటిట్యూడ్ తగ్గించుకోవాలని కోరుతున్నారు.
Anybody trying to grow in their field
Will Always have a Target on their back – But we fightback 🙂And when you are honest, yourself and want the best for everyone – The love of people and God will protect you ❤️🥰https://t.co/sWjn9ewDpr
— Vijay Deverakonda (@TheDeverakonda) August 19, 2022