Valentine’s Day: ప్రేమికుల కోసం.. హైదరాబాదులో భలే ఏర్పాట్లు.. త్వరపడండి

Valentine's Day మనసుకు నచ్చిన వారితో గడిపితే అనుభూతి వేరే విధంగా ఉంటుంది. గుండెలో స్థానం సంపాదించిన వారితో ఏడు అడుగులు వేస్తే ఆ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది.

Written By: Velishala Suresh, Updated On : February 14, 2024 12:07 pm

Valentine's Day

Follow us on

Valentine’s Day: పండుగలు కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటాం. స్నేహితుల దినోత్సవం దోస్తులతో జరుపుకుంటాం. కానీ వీటన్నికంటే భిన్నమైనది ప్రేమికుల దినోత్సవం. మనసుకు నచ్చిన వారితో, మనసు మెచ్చిన వారితో జరిపే ఈ వేడుక ఎవరికైనా ప్రత్యేకమే. అందుకే ప్రేమికుల దినోత్సవం ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేమికులు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. మన దేశంలో ఉన్న కొన్ని కట్టుబాట్ల వల్ల ప్రేమికుల దినోత్సవం అంత బహిరంగంగా జరుపుకోవడానికి అవకాశం లేదు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని కొన్ని సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈవెంట్లు జరుపుతున్నాయి. ఇక మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈవెంట్స్, పార్ట్స్ వివరాలు మీకోసం.

మనసుకు నచ్చిన వారితో గడిపితే అనుభూతి వేరే విధంగా ఉంటుంది. గుండెలో స్థానం సంపాదించిన వారితో ఏడు అడుగులు వేస్తే ఆ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ఇలా ఆలోచిస్తున్న వారు “రోమియో అండ్ జూలియట్” పార్టీకి వెళ్లాల్సిందే. జూబ్లీహిల్స్ లోని లా కుపులా లో వాలెంటైన్స్ డే సందర్భంగా క్యాండిల్ లైట్ డిన్నర్ అందిస్తోంది. ఇక్కడ రాత్రి 7 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు మొదలవుతాయి. లైవ్ మ్యూజిక్, థీమ్ మాస్క్ లు, షాంపైన్ టేబుల్ డెకర్ పంటి వాటిని ప్రేమికులు ఇక్కడ ఆస్వాదించవచ్చు. ప్యాకేజీ 5000 నుంచి ప్రారంభమవుతుంది. ఫిమేల్ స్టాగ్ టేబుల్ ధర వెయ్యి రూపాయల వరకు ఉంది.

ఇక కొన్ని జంటలకు ప్రకృతి అంటే ఇష్టం. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ ఉంది. ప్రేమ పక్షులు తమ సృజనాత్మకతను మరింత బయట పెట్టవచ్చు. ఇష్టమైన వారితో కలిసి మట్టి పరిమళాలు ఆస్వాదిస్తూ హాయిగా కుండలు తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కుండల వర్క్ షాప్ కోసం ది హౌస్ ఆఫ్ గౌర్మెట్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. టికెట్ ధర 1500 వరకు ఉంది. నచ్చిన వారితో కబుర్లు చెప్పుకుంటూ కుండలు తయారు చేయడం ప్రత్యేక అనుభూతి అని ఈ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రేమికుల రోజు సినిమాలు చూడడం చాలామందికి ఇష్టం. అది కూడా ఓపెన్ ఎయిర్ లో సినిమాలు చూడాలని చాలామంది ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసం సన్ సెట్ సినిమా క్లబ్, ది లాఫ్ట్, స్టార్ ఆధ్వర్యంలో ఐకానిక్ ఫిల్మ్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే అనే సినిమాను ప్రదర్శిస్తున్నారు. బీన్ బ్యాంగ్ సీటింగ్, సింగిల్స్ కు ఒక్కో టికెట్ ధర 550 వరకు చార్జ్ చేస్తున్నారు. నలుగురు బృందానికి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు.

ప్రేమికుల రోజు సందర్భంగా హైదరాబాదులోని నోవోటెల్ హోటల్ రొమాంటిక్ డిన్నర్ కోసం అవకాశం కల్పిస్తోంది. ఈతకొలను, లేదా పచ్చిక మైదానంలో టేబుల్స్ వేసుకొని వైన్ తాగుతూ.. నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో గ్రీల్ ధర 12,390, లాన్ సిట్టింగ్ ధర 14,750, ఫుల్ సైడ్ టేబుల్ ధర 17,700. లైవ్ మ్యూజిక్, ఫోటో బూత్, మాక్ టెయిల్స్, బార్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. వెస్ట్రన్, కాంటినెంటల్ రుచులు కూడా అందిస్తారు. నచ్చిన ఫుడ్ తినుకుంటూ.. నచ్చిన వారితో మాటలు చెప్పుకుంటూ.. కాలక్షేపం చేస్తుంటే ఆ మజానే వేరు.