
Cancer Vaccine: దీర్ఘకాలిక వ్యాధులు అయిన క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగలకు శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెప్పారు. ఈ వ్యాధులను నిరోధించే వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లతో రెండు దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
ఏళ్లుగా ప్రయోగాలు..
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య ఏటా ప్రమాకరంగా పెరుగుతోంది. లక్షల మంది ఈ వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి నియంత్రణకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. వీరి శ్రమ త్వరలోనే ఫలించబోతోంది. అన్నీ అనుకూలిస్తే క్యాన్సర్‌తోపాటు హృద్రోగాలు, ఆటో ఇమ్యూన్ డీసీజ్‌లకు చెక్ పెట్టే వ్యాక్సిన్లు 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంటున్నారు.
నమ్మకం పెంచుతున్న అధ్యయనాలు..
క్యాన్సర్, గుండె జబ్బుల వ్యాక్సిన్ల తయారీపై ఇప్పటివరకూ చేసిన అధ్యయనాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. 15 ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం 12–18 నెలల్లోనే సాధించి కొవిడ్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా రూపొందించగలగడమే ఈ నమ్మకానికి కారణమని పేర్కొంటున్నారు. వచ్చే ఐదేళ్లలో తాము అన్ని రకాల జబ్బులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాగలమని ప్రముఖ ఫార్మా కంపెనీ మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాల్ బర్టన్ ధీమా వ్యక్తం చేశారు. మోడెర్నా ప్రస్తుతం వివిధ రకాల కణుతులను టార్గెట్ చేసే క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్టు ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది.

అనేక అధ్యయనాల తర్వాత క్యాన్సర్, గుండె జబ్బుల మూలాలను శాస్త్రవేత్తలు పసిగట్టినట్లు తెలుస్తోంది. మూలాలకు చికిత్స చేయడం ద్వారా ఈ దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూల కణంపై పనిచేసేలా వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. మొత్తంగా మరో ఐదారేళ్లలో ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్పడం మాత్రం అందరికీ ఓ శుభవార్తనే!