
Sankarabharanam Movie Team: ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణం చిత్రానికి పని చేసినవారు ఒక్కొక్కరిగా కన్నుమూస్తున్నారు. రోజుల వ్యవధిలో ఒకే నెలలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీని యాదృచ్ఛికం అనుకోవాలా లేక అంతుబట్టని రహస్యం ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఫిబ్రవరి 2న ఆ చిత్ర దర్శకుడు కే విశ్వనాథ్ కన్నుమూశారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ రోజు రాత్రి కే విశ్వనాథ్ ఒక పాట రాస్తున్నారట. శరీరం సహకరించడకపోవడంతో తన కొడుకును పిలిచి పూర్తి చేయమన్నారట. కుమారుడికి పాట చెబుతూ అస్వస్థకు గురయ్యారట.
పక్కనే ఉన్న ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణించిన రెండు రోజులకు వాణి జయరాం హఠాన్మరణం పొందారు. శంకరాభరణం మూవీతో ఆమెకు విడదీయరాని బంధం ఉంది. ఎస్పీ బాలుతో కలిసి దాదాపు అన్ని పాటలు పాడారు. శంకరాభరణం పాటలకు విశేష స్థానం దక్కింది. అందులో వాణి జయరాం పాత్ర ఎంతగానో ఉంది. ఈ చిత్రానికి ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. గాయనిగా ఆమె కీర్తి మరో స్థాయికి చేరింది.
ఫిబ్రవరి 2న విశ్వనాథ్ మరణించగా 4న వాణి జయరామ్ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో వాణి జయరాం విగతజీవిగా కనిపించారు. తలకు గాయం ఉన్న నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం లో ఆమె ప్రమాదవశాత్తు క్రిందపడి మరణించారని తెలిసింది. ఇక ఫిబ్రవరి 21న శంకరాభరణం చిత్ర ఎడిటర్ జిజి కృష్ణారావు కన్నుమూశారు. 200 చిత్రాలకు పైగా పనిచేసిన జిజి కృష్ణారావు దర్శకుడు విశ్వనాథ్ తెరకెక్కించిన సాగరసంగమం, స్వాతిముత్యం తో పాటు పలు చిత్రాలకు ఎడిటర్ గా వ్యవహరించారు.

ఒకే నెలలో శంకరాభరణం చిత్రానికి పనిచేసిన ముగ్గురు కన్నుమూశారు. అది కూడా శివరాత్రి మాసంలో. మరో షాకింగ్ ఫాక్ట్ ఏమిటంటే… శంకరాభరణం విడుదల రోజే కే విశ్వనాథ్ కన్నుమూశారు. 1980 ఫిబ్రవరి 2న ఆ చిత్రం విడుదలైంది. 42 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజున విశ్వనాథ్ శివైక్యం అయ్యారు. ఒకరికి ముగ్గురు కన్నుమూసిన నేపథ్యంలో దీన్ని యాదృచ్చికం అనుకోలేమని, ఇది శివేచ్ఛ కావచ్చనే వాదన మొదలైంది.