
Revanth Reddy Padayatra: కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యానికి నిలువెత్తు ఉదాహరణ. అంతర్గత కుమ్ములాటలకు నిలువెత్తు పరాకాష్ట. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో, కెసిఆర్ కొట్టిన దెబ్బలకు ఎదురీదుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ దక్కించుకోలేకపోతోంది.. పైగా ప్రజల్లో నానాటికి చులకన అయిపోతుంది. దీనికి తోడు నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆయన కాళ్లల్లో కట్టెలు పెట్టారు.. దీంతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
మొదట్లో దూరం
రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు జిల్లాలో ప్రారంభమైంది. పైగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో ముగియడంతో… అధిష్టానం రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ కు సూచించింది. దీంతో కొంతమంది సీనియర్లు మినహా అందరూ ఏకతాటి పైకి వచ్చారు. ములుగు జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో చేపట్టిన యాత్రకు మొదట్లో భట్టి విక్రమార్క, ఆయన వర్గీయులు హాజరు కాలేదు.. దీంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆయన సొంత నియోజకవర్గం మధిరలోనే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన కూడా రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలపాల్సి వచ్చింది.
వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో..
కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చే పనిలో భాగంగా రేవంత్ రెడ్డి విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. జనాలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే తప్పు ఏమిటని వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే చర్చకు దారి తీసింది.

ఈ వ్యాఖ్యల ఆధారంగా బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండూ ఒకే తానులో ముక్కలని ప్రచారం చేయడం ప్రారంభించింది. దీంతో వెంకట్ రెడ్డిని అధిష్టానం ఢిల్లీ పిలిపించింది. వారికి ఆయన వివరణ ఇచ్చారు. తాను కూడా యాత్ర చేస్తానని, అనుమతి ఇవ్వాలని కోరారు.. దీనికి అధిష్టానం సమ్మతం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనబోనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ వైరాన్ని కూడా సద్దుమణిగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర వెంకట్ రెడ్డిని మినహా మిగతా అందర్నీ ఒక తాటిపైకి తెచ్చింది. మరి ఈ సయోధ్య ఎన్నికల వరకు ఉంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది.