Allu Aravind – Allu Sneha Reddy : కోడలు స్నేహారెడ్డిని ఉద్దేశిస్తూ అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ధనవంతుల ఇంట్లో పుట్టి, స్టార్ హీరో భార్య అయ్యుండి కూడా ఆమె కష్టపడుతుంది అన్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. రైటర్ పద్మభూషణ్ సక్సెస్ మీట్లో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ… రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని మన బ్యానర్ లో విడుదల చేద్దామని బన్నీ వాసు అన్నాడు. మొదట నాకు ఆసక్తి కలగలేదు. మూవీ చూశాక ఇంత మంచి చిత్రం మనమే విడుదల చేయాలి అన్నాను. మూవీలో మంచి సందేశం ఉంది.
ప్రతి ఆడపిల్ల తన భవిష్యత్ గురించి కలలు కంటుంది. పేరెంట్స్ వారిని ప్రోత్సహించాలి. కాబట్టి అమ్మాయిలు తమ పేరెంట్స్ తో పాటు రైటర్ పద్మభూషణ్ చిత్రం చూడాలి. నేను ఇంటికి వెళ్ళాక నా భార్యను నువ్వు ఏమవ్వాలి అనుకున్నావని అడిగాను. అంతగా ఈ సినిమా నన్ను ప్రభావితం చేసింది. ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు కూడా తమ కాళ్ళ మీద నిలబడాలి. తమకంటూ కెరీర్ ఏర్పాటు చేసుకోవాలి. నా కోడలు స్నేహారెడ్డికి పని చేయాల్సిన అవసరం లేదు. ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టారు. పెద్ద ఫ్యామిలీకి కోడలిగా ఉన్నారు. స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా ఉన్నారు. అయినా ఆమె కష్టపడుతున్నారు… అని చెప్పుకొచ్చారు.
స్నేహారెడ్డికి కోట్ల సంపద ఉంది. ఎలాంటి పని చేయకుండా దర్జాగా బ్రతికేసే అవకాశం ఉంది. తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద ఉన్నప్పటికీ స్నేహారెడ్డి తనకంటూ ఒక కెరీర్, సంపాదన ఏర్పాటు చేసుకున్నారని అల్లు అరవింద్ పరోక్షంగా చెప్పారు. అల్లు స్నేహారెడ్డి ఫాదర్ సుధాకర్ రెడ్డి విద్యావేత్త. ఆయనకు హైదరాబాద్ లో విద్యాసంస్థలు ఉన్నాయి. సౌండ్ ఫ్యామిలీలో పుట్టారు. అల్లు అర్జున్ ని లవ్ మ్యారేజ్ చేసుకొని అల్లు అరవింద్ కోడలు అయ్యారు.
స్టార్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ స్టార్ గా ఎదిగాక మరింత ఆస్తిపరులు అయ్యారు. అల్లు స్టూడియోస్ పేరుతో భారీ స్టూడియో నిర్మించారు. ఇక అల్లు అర్జున్ సినిమాకు రూ. 80 నుండి 100 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్థికంగా అంత బలంగా ఉన్న ఇంటి కోడలిగా స్నేహారెడ్డి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ పని చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి స్నేహారెడ్డి సపరేట్ కెరీర్ వెతుకున్నారు.