TSRTC MD Sajjanar: వాయువేగంలో వాహనాలు ఢీ.. ఈ చిన్నారి అయినా బతికిబయటపడింది.. అద్భుతాన్ని షేర్ చేసిన సజ్జనార్

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

Written By: BS, Updated On : June 19, 2023 11:47 am

TSRTC MD Sajjanar

Follow us on

TSRTC MD Sajjanar: రోడ్డు ప్రమాదం ఒక నిండు జీవితాన్నే కాదు ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. అందుకే ప్రయాణించేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సూచిస్తుంటాయి. ఒక్కోసారి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాళ్లు జీవితాంతం మంచానికే పరిమితమై నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, అది కొద్దిసార్లు మాత్రమే తీవ్రమైన ప్రమాదాలకు గురికావాల్సిన వారు కూడా తృటిలో తప్పిపోయి ఆశ్చర్యానికి చేసిన ఘటనలు అరుదుగా కనిపిస్తుంటాయి. అటువంటి అరుదైన ఘటనకు సంబంధించిన ఒక వీడియోను తెలంగాణ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించే ప్రయత్నాలు చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సామాజిక మాధ్యమాలను ఇందుకోసం పెద్ద ఎత్తున ఆయన వినియోగిస్తుంటారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు అనుగుణంగా వివిధ రకాల వీడియోలు ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా అటువంటి వీడియోను ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. ఆయన చూసిన వీడియోను వేలాదిమంది వీక్షించడంతోపాటు వందలాది మంది షేర్ చేశారు. అదృష్టం బాగుంటే ఇలా కూడా కలిసి వస్తుంది అనే రీతిలో ఈ వీడియో ఉండడం గమనార్హం.

చిన్నారికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

సజ్జనార్ ట్విట్టర్ లో పెట్టిన వీడియోలు ఏముందంటే.. ఒక ప్రధాన రహదారిపైకి ఒక చిన్నారి పరుగున వెళ్ళింది. అదే సమయంలో అటు నుంచి ఒక పెద్ద కంటైనర్ వాహనం అత్యంత వేగంతో వస్తోంది. చిన్నారి ఆ కంటైనర్ వెళ్లే రోడ్డులోకి వెళుతున్న క్రమంలో ఒక బైకర్ ఆ చిన్నారిని ఢీ కొట్టడంతో పడిపోయింది. చిన్నారి పడిపోవడంతో ఆ పక్క నుంచి కంటైనర్ వెళ్ళింది. అదే సమయంలో ఆ చిన్నారిని ఢీ కొట్టిన బైకర్ వెంటే మరో ఇద్దరు బైకర్లు అత్యంత వేగంతో చిన్నారికి అత్యంత సమీపం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత వచ్చిన చిన్నారి తల్లి బిడ్డను హత్తుకుని.. ఏ దేవుడు రక్షించాడో అంటూ బోరున విలపించింది. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇటువంటి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డు కావడంతో బయటకు వచ్చింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందన్న విషయాన్ని మాత్రం సజ్జనార్ తన పోస్టులో వెల్లడించలేదు. కానీ, ఈ వీడియోను చూసిన వారికి ప్రమాదం జరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైంది.

క్యాప్షన్ ఎలా పెట్టిన సజ్జనార్..

సజ్జనార్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతోపాటు దాని కింద ఇలా కామెంట్ చేశారు. ‘ రహదారుల వెంట పిల్లలను తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదం. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదు’ అని సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సజ్జనార్ చెప్పినట్లు బయటకు వెళ్లేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ప్రమాదాల్లో ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబమే రోడ్డున పడుతుంది. ఒకవేళ ఆ కుటుంబంలోని సభ్యులను కోల్పోతే ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.