Vijayasai Reddy- Nara Lokesh: వారిద్దరూ ఉప్పూ నిప్పులా ఉంటారు. పప్పు, తుప్పు అంటూ విమర్శించుకుంటారు. ఒకరు ఏలినాటి శని అంటే మరొకరు దొంగ వీసా అంటూ పరస్పరం విరుచుకుపడతారు. ట్విట్లర్లో ట్వీట్ల మోత మోగిస్తారు. ఆ నేతలెవరో కాదు టీడీపీ నేత నారా లోకేష్, వైసీపీ నేత విజయసాయిరెడ్డి. నారా లోకేష్ బర్త్ డే సందర్భంగా విజయసాయిరెడ్డి విష్ చేశారు. దీంతో కొత్త చర్చకు తెరలేపారు.

వైసీపీ నేత విజయసాయి రెడ్డి తిట్ల దండకం మామూలుగా ఉండదు. ప్రత్యర్థుల పై తిట్ల ట్వీట్లతో విరుచుకుపడతారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ని తూర్పారబడతారు. కానీ అనూహ్యంగా విజయసాయిరెడ్డి ప్లేట్ పిరాయించారు. లోకేష్ ను పప్పు, తుప్పూ అంటూ తిట్టే విజయసాయిరెడ్డి.. నారా లోకేష్ బర్త్ డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలంటూ దీవించారు. ఆరోగ్యంగా జీవించాలంటూ కోరుకున్నారు. సడెన్ గా వచ్చిన ఈ మార్పుతో టీడీపీ అభిమానులు షాక్ తిన్నారట. ఎప్పుడూ విమర్శించే సాయిరెడ్డి శుభాకాంక్షలు తెలపడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఈ మార్పుకు కారణం ఏంటో అని గుసగుసలాడుతున్నారట.
తెలుగుదేశం యువనేత నారా లోకేష్ జన్మదినం నేడు. పెద్ద ఎత్తున అభిమానులు లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #HBDYoungLeaderLokesh అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మంత్రిగా లోకేష్ తీసుకున్న నిర్ణయాలను కీర్తిస్తూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఈనెల 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలవుతుంది. ఏపీ వ్యాప్తంగా 400 రోజులు 4000 కిలోమీటర్లు నారా లోకేష్ పాదయాత్ర చేస్తారు.

జనవరి 25న ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించి హైదరాబాద్ నుంచి లోకేష్ బయలుదేరుతారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని కడపకు చేరుకుంటారు. కడపలో అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు. అనంతరం కడపలో చర్చిలో క్రైస్తవ మత ప్రార్థనల్లో పాల్గొంటారు. 26వ తేదీన తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 26న లోకేష్ కుటుంబ సభ్యులు కుప్పం చేరుకుంటారు. 27 నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి పాదయాత్రకు అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.