Trivikram- Mahesh Movie: దర్శకుడు త్రివిక్రమ్ కథలు తెలుగు నేటివిటీని ప్రతిబింబిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే పాత సినిమాల అప్డేటెడ్ వర్షన్స్ లా ఉంటాయి. ఈ తరం హీరోల ఇమేజ్ కి తగ్గట్లు మార్పులు చేసి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కిస్తారు. త్రివిక్రమ్ కెరీర్లో అతిపెద్ద హిట్ అల వైకుంఠపురంలో ఎప్పుడో ఎన్టీఆర్ చేసిన ఇంటి గుట్టు సినిమా కాపీ అనిపిస్తుంది. ఈ రెండు చిత్రాలు కోర్ పాయింట్ ఒకటే. తన కొడుకు రాజభోగాలతో పెరగాలన్న పేద తండ్రి కుటిల బుద్ధికి బలైన హీరో, ధనవంతుడు కడుపున పుట్టి పేదరికంలో మగ్గిపోతాడు.

ఎప్పుడో 60లలో వచ్చిన ఆ సినిమా ఎవరికీ గుర్తు లేదు కాబట్టి… ఈ జనరేషన్ కి అది సరికొత్త ఫ్యామిలీ స్టోరీ. టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లో మేటి అయిన త్రివిక్రమ్ కథల విషయంలో మాత్రం వీకే. ఎక్కడో ఒకచోట లేపేస్తాడు. అజ్ఞాతవాసి మూవీ విషయంలో ఆయన అడ్డంగా దొరికిపోయాడు. ఫ్రెండ్ మూవీ లార్గో వించ్ కథను పవన్ తో అజ్ఞాతవాసిగా చేశారు. ఆ మూవీ పరాజయం కావడంతో పాటు లార్గో వించ్ డైరెక్టర్ రచ్చ చేయడంతో త్రివిక్రమ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.
ఇక మహేష్ కోసం ఆయన ఎలాంటి కథ సిద్ధం చేశారనే సందిగ్ధత కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబి 28 స్టోరీ ఇదే అంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. మహేష్ కోసం కూడా ఆయన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ ఎంచుకున్నారట. మహేష్ సొంత జిల్లా గుంటూరు ఏరియాలో కథ నడుస్తుందట. దీనిలో ఆంధ్రా బ్యాంకు నేపథ్యం ఉంటుందట. త్రివిక్రమ్ హీరో నితిన్ తో చేసిన హిట్ మూవీ ‘అ ఆ’ కి దగ్గరగా ఉంటుందట.
‘అ ఆ’ మూవీలో సున్నితమైన ఫ్యామిలీ ఇగోస్ ని బేస్ చేసుకొని మూవీ చేశారు. మేనల్లుడు, అత్తయ్య కుటుంబాల మధ్య ఆర్థికపరమైన విషయాల కారణంగా దూరం పెరుగుతుంది. హీరో పల్లెటూరిలో మధ్యతరగతి జీవితం గడుపుతుంటే… మేనత్త కూతురైన హీరోయిన్ పట్టణంలో తల్లి ఆంక్షల మధ్య లగ్జరీలు ఉండి కూడా… అసంతృప్తికర లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, రెండు కుటుంబాల మధ్య ఉన్న ఇగోలు ఎలా పరిష్కారం అయ్యాయి అనేది సినిమా.

ఈ మూవీలో భయంకరమైన హీరోయిజం ఉండదు. ఫైట్స్ ఉంటాయి కానీ కరుడుగట్టిన విలన్స్ ఉండరు. అయినప్పటికీ సినిమా ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది. ‘అ ఆ’ తరహాలోనే మహేష్ మూవీ ఉండనుందట. మహేష్ స్టార్ హీరో కాబట్టి కొంచెం యాక్షన్ పాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం కలదంటున్నారు. కాగా ‘అ ఆ’ మూవీ యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘మీనా’ నవల కాపీ అంటూ ఆరోపణలు రావడం జరిగింది. ఈ ప్రశ్నకు త్రివిక్రమ్ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. కాగా మహేష్-త్రివిక్రమ్ మూవీ జనవరి నుండి లాంగ్ షెడ్యూల్ జరగనుంది.