https://oktelugu.com/

Alluri Sitaramaraju District : రాజ్యమా.. సిగ్గుపడు

గ్రామంలో కనీస వసతులు లేవు. ముఖ్యంగా రహదారి సదుపాయం లేదు. అత్యవసర, అనారోగ్య సమయాల్లో 108, 104 వాహనాలు రావడం కష్టం. రేషన్ వంటి పౌరసేవల కోసం 8 కిలోమీటర్ల మేర కొండ దిగి మైదాన ప్రాంతానికి రావాల్సిందే. ఉన్న 8 కిలోమీటర్ల కచ్చా రోడ్డు సైతం వర్షాలకు కొట్టుకుపోయింది. చిన్నపాటి వాగులా మారిపోయింది. గ్రామంలో తాగునీరు, రోడ్లు లేవు. ఇంకా మరెంత మంది బలికావాలని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణీ రోజా  మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భర్త చంటి డిమాండ్ చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 23, 2023 / 10:38 AM IST
    Follow us on

    Alluri Sitaramaraju District : 108, 104 వాహనాలు వచ్చేందుకు రహదారులు లేవు. విలేజ్ క్లినిక్ సేవలు అక్కరకు రావడం లేదు. ఆయుష్మాన్ భారత్ సేవలు కానరావడం లేదు. అత్యవసర వైద్యసేవలు అందడం లేదు.ఫలితంగా మన్యవాసుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డోలీ బతుకులు తెల్లారిపోతున్నాయి. మన్యంలో ప్రతీరోజూ ఇటువంటి ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ హృదాయ విదారక ఘటన వెలుగుచూసింది.  నడి రోడ్డుపై ఓ నిండు చూలాలు మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోధిస్తున్న తీరు కన్నీటిని తెప్పించింది.ప్రభుత్వాల ఉదాసీనతను, యంత్రాంగం దయనీయ పరిస్థితిని తెలియజేసింది.

    అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కుంబుర్ల కొండ గ్రామానికి చెందిన పాంగి రోజా (20) అనే గర్భిణీకి మంగళవారం సాయంత్రం ప్రసవనొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. 108 వాహనం వచ్చేందుకు వీలు లేకపోవడంతో ఆశ కార్యకర్త శాంతి సాయంతో స్ట్రెచర్ పై కూర్చోబెట్టి ఆస్పత్రికి బయలుదేరారు. అప్పటికే రోజా అపస్మారక స్థితికి చేరుకుంది. సుమారు 8 కిలోమీటర్ల కచ్చా మార్గంలో ఆర్ల గ్రామానికి చేరుకోవాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా 20 కిలోమీటర్లు ప్రయాణించి డౌనూరు పీహెచ్ సీకి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా ఊరు నుంచి స్ట్రెచర్ పై బయలుదేరి రెండు కిలోమీటర్లు ప్రయాణించేటప్పటికి రోజా ప్రాణాలను విడిచిపెట్టింది.కుటుంబసభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్యమా సిగ్గుపడు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

    ఈ మృత్యుఘోషకు ప్రభుత్వమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 45 కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామంలో కనీస వసతులు లేవు. ముఖ్యంగా రహదారి సదుపాయం లేదు. అత్యవసర, అనారోగ్య సమయాల్లో 108, 104 వాహనాలు రావడం కష్టం. రేషన్ వంటి పౌరసేవల కోసం 8 కిలోమీటర్ల మేర కొండ దిగి మైదాన ప్రాంతానికి రావాల్సిందే. ఉన్న 8 కిలోమీటర్ల కచ్చా రోడ్డు సైతం వర్షాలకు కొట్టుకుపోయింది. చిన్నపాటి వాగులా మారిపోయింది. గ్రామంలో తాగునీరు, రోడ్లు లేవు. ఇంకా మరెంత మంది బలికావాలని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణీ రోజా  మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భర్త చంటి డిమాండ్ చేశారు. తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.