Tollywood Bandh : తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఉపద్రవానికి కారకులెవరు?

Tollywood Bandh : తెలుగు సినీ పరిశ్రమ బంద్ అయ్యింది. నిర్మాతలు అందరూ ఏకంగా 2 నెలల పాటు సినిమా షూటింగ్ లు బంద్ పెట్టారు. సినిమాలు నిర్మించడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. ముఖ్యంగా సినిమాకు రూ.50 కోట్లు తీసుకునే హీరోలు.. రూ30 కోట్ల వరకూ వసూలు చేసే దర్శకులు.. బ్లాక్ బస్టర్ అయితే వీళ్లకు వాటాలు.. ఇక సినిమా ఓటీటీలో వస్తుందని థియేటర్ కు వెళ్లని ప్రేక్షకులు.. వెరసి అప్పులు తెచ్చి సినిమా తీసిన […]

Written By: NARESH, Updated On : July 18, 2022 8:54 pm
Follow us on

Tollywood Bandh : తెలుగు సినీ పరిశ్రమ బంద్ అయ్యింది. నిర్మాతలు అందరూ ఏకంగా 2 నెలల పాటు సినిమా షూటింగ్ లు బంద్ పెట్టారు. సినిమాలు నిర్మించడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. ముఖ్యంగా సినిమాకు రూ.50 కోట్లు తీసుకునే హీరోలు.. రూ30 కోట్ల వరకూ వసూలు చేసే దర్శకులు.. బ్లాక్ బస్టర్ అయితే వీళ్లకు వాటాలు.. ఇక సినిమా ఓటీటీలో వస్తుందని థియేటర్ కు వెళ్లని ప్రేక్షకులు.. వెరసి అప్పులు తెచ్చి సినిమా తీసిన నిర్మాతకు కాసులు తిరిగి రాక చిప్ప చేతికి వస్తోంది. అందరికీ తన సంపదను దోచిపెట్టడం తప్పితే తనేమీ మిగుల్చుకోకుండా అప్పుల పాలవుతున్న నిర్మాతల కడుపు మండింది. అందుకే సినీ పరిశ్రమను బంద్ పెట్టారు. షూటింగ్ లన్నీ ఆపేశారు. అందరూ అనుకుంటున్న ఈ ఉపద్రవానికి ఓటీటీలు కారణమా? తెలుగు సినీ హీరోలు , ఇక్కడి పరిస్థితులు కారణం కాదా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-హీరోల రెమ్యూనరేషన్ కొండంత? జూనియర్ ఆర్టిస్టులకు పిసరంత
రెండు మూడు నెలలు మాత్రమే సినిమాకు తన డేట్స్ ఇచ్చే పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.. మహేష్ బాబుది దాదాపు అంతే. ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది అయితే రూ.100 కోట్లు. అల్లు అర్జున్ కూడా ‘పుష్ఫ’తో భారీగా పెంచేశాడు. ఇక ఆ తర్వాత అగ్ర దర్శకులు సినిమాకు రూ30 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. ఇందులో రాజమౌళి మినహాయింపు. ఆయన సినిమాకు వందల కోట్లు తీసుకుంటాడు. ఫ్యామిలీ ప్యాకేజ్ లా వాటాను తీసుకుంటారు. త్రివిక్రమ్, కొరటాల సహా అగ్ర దర్శకులు రూ.30 కోట్ల వరకూ వసూలు చేస్తారు. ఇక వీరే కాదు.. హీరోయిన్లు, ప్రధాన తారాగణం, బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులు భారీగా తమ రెమ్యూనరేషన్స్ పెంచేశారు. అయితే సినిమా తీయడంలో కీలకంగా వ్యవహరించే డైరెక్టర్, కెమెరామెన్, సహా నాలుగైదు విభాగాల నిపుణుల రెమ్యూనరేషన్ మాత్రమే పెరుగుతోంది. మిగతా వారి స్థితిగతులు అలానే ఉన్నాయి.. చిన్న జూనియర్ , క్యారెక్టర్ ఆర్టిస్టులకు రోజు రూ.500 మాత్రమే చెల్లిస్తూ వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. వారు అరిచి గీపెట్టినా సరే ఒక్క రూపాయి విదిల్చడం లేదు. బడా ఆర్టిస్టులు తప్ప మిగతా వారి బతుకులు కడు దుర్భరంగా ఉన్నాయి. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లకే సినిమా బడ్జెట్ లో 75 శాతం పోవడంతో మిగిలిన 25శాతంతో సినిమా తీసి అది సరిగా రాకపోతే నిండా మునుగుతున్నాడు నిర్మాత. రెమ్యూనరేషన్ ను కూడా బడ్జెట్ గానే భావిస్తూ సినిమా క్వాలిటీ మరిచి ఫ్లాపులు తెచ్చుకొని నిర్మాతలు సూసైడ్ చేసుకునే వరకూ వెళుతోంది..

-ఓటీటీల ఎఫెక్ట్ బోలెడంత?
కరోనా కల్లోలంలో సినిమా ఇండస్ట్రీ అంతా మూతపడింది. అప్పుడు జనాలకు అలవాటైందే ఈ ఓటీటీలు. అప్పటి నుంచి ఓటీటీ సంస్థలు భారీగా లాభపడి మంచి ఖతర్నాక్ కంటెంట్ ను వేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నాయి. దీంతో సగటు ప్రేక్షకులు సినిమా కోసం థియేటర్ కు వెళ్లేకంటే ఇంట్లో కూర్చుండే చూస్తే బెటర్ అని డిసైడ్ అయ్యాడు. సినిమా విడుదలయ్యాక ఎవరూ థియేటర్ వైపు రావడం లేదు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, పుష్ప లాంటి భారీ సినిమాలకు తప్ప చిన్న సినిమాలు, మామూలు హీరోల సినిమాలను అస్పలు పట్టించుకోవడం లేదు. థియేటర్ కు వచ్చి చూడడం లేదు. నెల రోజుల తర్వాత ఎలాగూ ఓటీటీలో వస్తుందలే అప్పుడే చూద్దాం అని ప్రేక్షకులు కరోనా తర్వాత థియేటర్ కు రావడం మానేశాడు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీడియం, చిన్న హీరోలపై పడింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్ కు వస్తున్నాడు. లేదంటే అసలు భారీగా పెరిగిన సినిమా టికెట్ల దెబ్బకు.. ఇక థియేటర్లో స్నాక్స్, పార్కింగ్ ధరాఘాతానికి అస్సలు థియేటర్ కు రావడానికే జంకుతున్నాడు.మీడియా, సినీ ప్రముఖులు కూడా మంచి కంటెంట్ తో వస్తున్న సినిమాలను ప్రమోట్ చేయడం లేదు. పట్టించుకోవడం లేదు. దీంతో అవి ప్రేక్షకుడి వరకూ వెళ్లకపోవడంతో వాటిని చూడలేకపోతున్నారు. సినిమా థియేటర్లో ఆదరించిన సినిమాను ఓటీటీల్లో జనం ఇష్టపడుతున్నారంటే దానికి తగినంత ప్రమోషన్ లేకపోవడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రమోషన్ కు బాగా ఖర్చు పెరగడం కూడా సినిమా చేశాక ప్రమోట్ చేసుకోకపోవడానికి కారణంగా చెప్పొచ్చు.

-థియేటర్ వ్యవస్థ నాశనం
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై నియంత్రణ విధించి ఆంక్షలు పెట్టినా చర్చల తర్వాత పెద్ద సినిమాలకు భారీగా పెంచేసింది. ఇక తెలంగాణలో అయితే ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పెద్ద హీరోల సినిమాలకు భారీగా ధరలు పెట్టి రిలీజ్ చేశారు. పెంచిన ధరలు చూసి బెంబేలెత్తిన ప్రేక్షకులు అసలు థియేటర్ కు రావడమే మానేశాడు. ఒక కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే కనీసం రూ.1000 నుంచి 1500 ఖర్చవుతోంది. ఇంటర్వెల్ వేళ స్నాక్స్, డ్రింక్స్ కొందామంటే రూ.500 తక్కువ ఉండవు. పార్కింగ్ ఫీజులు బోలెడంతా పెంచేశారు. థియేటర్ కాస్ట్ విపరీతంగా పెంచడం వల్ల సామాన్యుడికి భారమై థియేటర్ రావడం మానేశారు. థియేటర్ కు జనాలు రాకపోవడంతో కూల్ డ్రింక్స్,పార్కింగ్ వాళ్లు బతకలేకపోతున్నారు. థియేటర్లను నమ్ముకొని ఉన్న కుటుంబాలు సైతం వీధిన పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి థియేటర్ యజమానులు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నెట్ వర్క్ యే కారణం. వీరంతా కలిసే థియేటర్లకు జనాలు రాకుండా చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.థియేటర్ల వ్యవస్థ నాశనం కావడానికి కారణం ప్రభుత్వాలు, సినీ వ్యవస్థనే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మల్టీపెక్స్ పై దృష్టి సారిస్తూ సింగిల్ థియేటర్ ను పట్టించుకోకపోవడం కూడా ఈ దుస్థితికి కారణంగా చెప్పొచ్చు. ఒకప్పుడు సింగిల్ థియేటర్లు నగరాలు, పట్టణాల్లో హౌస్ ఫుల్ తో నడిచేవి.కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్ రాకతో అంతా అటే పోతున్నారు. నిర్మాతలు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సింగిల్ థియేటర్ల నిర్వహణ తలకు మించిన భారమవుతోంది… సినిమాలు ఆక్యూపెన్సీ ప్రకారం ఆడక నష్టాలతో సింగిల్ థియేటర్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక థియేటర్ లో రెగ్యులర్ గా సినిమాలు రావడం లేదు. అగ్రహీరోల సినిమాలు కూడా ప్రస్తుతం రెండేళ్లకు, సంవత్సరానికొకటి వస్తున్నాయి. వచ్చినవి హిట్ కావడం లేదు. ఏడాదికి ఒకటి రెండుకు మించి బ్లాక్ బస్టర్ మూవీలేవు. దీంతో థియేటర్లకు జనాలు రావడం కష్టమవుతోంది. అది కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలను నిండా ముంచుతోంది. ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేస్తే నిర్మాతలకు ప్రాఫిట్ అయినా.. కింద ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. ఇక సినిమాను కష్టపడి తీసిన నిర్మాత అది థియేటర్ లో ఆడుతుందో లేదోనని భయపడి మంచి రేటు వస్తే ఓటీటీకి అమ్మేస్తున్నాడు. దీంతో థియేటర్లో సినిమాలు విడుదల కాక ఈ రకంగానూ థియేటర్ వ్యవస్థ నాశనం అవుతోంది.

మొత్తంగా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం మూతపడడానికి కారకులు అందరూ.తొలి దశలో ఓటీటీలకు ఎగబడి సినిమాను అమ్ముకొని ఇప్పుడు ఓటీటీలకు అమ్మకుండా జాప్యం చేయడం.. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు భారీగా రెమ్యూనరేషన్లు పెంచడం.. ఇలా ఎన్నో కారణాలు నిర్మాతను ముంచేస్తున్నాయి. ఈ పాపంలో అందరి భాగస్వామ్యం ఉంది.