
G20 in Visakhapatnam : విశాఖ వేదికగా రెండు రోజులపాటు జి20 వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగనుంది. మంగళ, బుధవారాల్లో జరగనున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 60 మందికి పైగా ప్రతినిధులు విశాఖకు వస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో ఈ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏడు సెషన్లు..ఒక వర్క్ షాప్
సదస్సుకు సంబంధించిన వివరాలను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ సాల్మన్ అరోక్య రాజ్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రెండు రోజులు సదస్సులో భాగంగా ఏడు సెషన్లో ఉంటాయని, వీటిలో మొదటి రోజు నాలుగు సెషన్లు, రెండో రోజు మూడు సెషన్లు ఉంటాయని తెలిపారు. అలాగే ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారని ఆయన వివరించారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.
ఈ నెల 30న ట్రైనింగ్ క్లాసులు..
ఈ నెల 30న జి20 దేశాల నుంచి వచ్చిన వారికి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయని, మిగిలిన దేశాల వారికి వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. అలాగే 31న దేశంలోని అన్ని నగరపాలక సంస్థల కమిషనర్లు, జి20 ప్రతినిధుల పరస్పర అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొదటి నాలుగు రోజులపాటు విశాఖలో జి20 ప్రతినిధుల బృందం బస చేయనుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
నేడు నగరానికి రానున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి..
జీ20 సదస్సులో భాగంగా నగరానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఈనెల 28న సాయంత్రం ఐదు గంటలకు విశాఖ చేరుకుని రాత్రి 8 గంటల వరకు రాడిసన్ బ్లూ హోటల్ లో ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అదే హోటల్లో ఆయా ప్రతినిధులకు గాలా డిన్నర్ సీఎం ఇవ్వనున్నారు.
ఢిల్లీ వేదికగా జీ20-2023 సదస్సు..
జీ20 సదస్సులో భాగంగా సన్నాక సమావేశాలను విశాఖ తో పాటు అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు. ప్రధాన సదస్సును ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని 50 ప్రధాన నగరాల్లో ఈ సన్నాహక సమావేశాలు జరుగుతుండగా, అందులో ఒక సమావేశాన్ని విశాఖలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జి20 సన్నాహక సదస్సులు బెంగుళూరు, చండీగర్, చెన్నై, గౌహతి, ఇండోర్, జోద్పూర్, కలకత్తా, లక్నో, ముంబై, పూణే, సూరత్, తిరువనంతపురం, ఉదయపూర్ నగరాల్లో సదస్సులను నిర్వహించారు. ఈ క్రమంలోనే మార్చి 28 29 తేదీల్లో విశాఖ వేదికగా జీ20 సమావేశానికి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే సదస్సు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
నగరమంతటా ఆధునీకరణ పనులు..
సదస్సులో భాగంగా నగరానికి వచ్చే విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేందుకు అనుగుణంగా సుమారు రూ. 130 కోట్ల రూపాయలతో విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. నగరాన్ని విద్యుత్ దీపాలంకరణలతో తీర్చిదిద్దారు. అదస్సు నిర్వహణ కోసం 2500 మంది పోలీసులను నగరమంతటా మోహరించారు. వీరిలో 1850 మంది సివిల్ పోలీసులు, 400 మంది ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు, రెండు గ్రేహౌండ్స్ దళాలు, రెండు క్యూఆర్ టీమ్ లు, ఆరు ప్రత్యేక పార్టీలు, రెండు ఏపీఎస్పీ ప్లాటున్లు ఉన్నాయి.