https://oktelugu.com/

Mulugu District: కరెంటు లేదు..పక్కనే ప్రాజెక్టూ లేదు.. పాతాళగంగ ఉబికి వస్తోంది.. 20 ఎకరాలకు నీళ్లు అందిస్తోంది.. వైరల్ వీడియో

కరెంటు లేదు.. పక్కనే ప్రాజెక్టు కూడా లేదు.. చెరువు కాలువ దరిదాపుల్లో లేదు. అయినప్పటికీ అక్కడ ఇరవై ఎకరాలకు సాగునీరు అందుతుంది. మూడు కార్ల పంట పండుతోంది.

Written By: , Updated On : February 20, 2025 / 11:57 AM IST
Mulugu District

Mulugu District

Follow us on

Mulugu District: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి అనే గ్రామం ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రామంలో గుట్టలు, కొండలు ఎక్కువగా ఉంటాయి. భూములు కూడా ఎర్ర మృత్తికకు సంబంధించినవి. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేదలే నివసిస్తుంటారు. వారికి కొద్దో గొప్పో భూములు ఉన్నాయి. పేదలు కావడంతో ఆ భూముల్లో వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి రైతుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలని భావించిన అప్పటి ప్రభుత్వం ఇందిర జలప్రభ కింద బోర్లను తవ్వించాలని భావించింది. ఇందులో భాగంగా మూడు చోట్ల బోర్లను తవ్వింది. బోర్లను తవ్విస్తున్న క్రమంలోనే విపరీతంగా నీరు పడింది. అయితే నాడు కరెంటు సౌకర్యం లేకపోవడంతో ఆ బోర్లకు మోటార్లను ఏర్పాటు చేయలేదు. అయితే నాటి నుంచి ఆ బోర్ల నుంచి నీరు రావడం మొదలు పెట్టింది.

మూడు పంటల సాగు

బోర్ల నుంచి అదే పనిగా నీరు వస్తున్న నేపథ్యంలో రైతులు పంటల సాగు చేయడం మొదలుపెట్టారు. 365 రోజులపాటు నీరు అదే పనిగా రావడంతో సుమారు 20 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో రైతులు వరి పంట సాగు చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వరకు ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. అయితే భూమిలో ఉన్న జల పొరలకు బోరు తగలడం వల్లే నీరు విపరీతంగా వస్తున్నదని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ” కరెంటు సౌకర్యం లేదు. అయినప్పటికీ భూగర్భంలో ఉన్న జల పొరకు బోరు తగలడంతో నీరు అదే పనిగా వస్తున్నది. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ఈ స్థాయిలో నీరు రావడం అంటే అద్భుతమని చెప్పాలి. రైతులు తమ పంటలు సాగు చేసుకోవడానికి ఈ స్థాయిలో నీరు రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కొద్ది మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. అవి ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అవి మూడు పంటలు పండేందుకు సహకరిస్తున్నాయి. అయితే ఇక్కడ తప్ప ఇదే గ్రామంలో ఇతర ప్రాంతాల్లో బోర్లు వేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని” భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు ఈ బోర్ల నుంచి వస్తున్న నీరును చూసేందుకు చుట్టుపక్కల రైతులు, ఇతర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు వస్తుంటారు. భూమి నుంచి ఉబికి వస్తున్న ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉందని.. తాగడానికి ఎంతో రుచిగా ఉందని రైతులు చెబుతున్నారు. పైగా ఈ నీటిని వారు తమ తాగునీటి అవసరాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు.