
Nani: ప్రతి చోటా రాజకీయాలు ఉంటాయి. చిత్ర పరిశ్రమలో మరీను. ఒకరిని పెంచడానికి మరొకరిని తొక్కేయాలని చూస్తారు. మన ప్రమేయం లేకుండా అనవసర వివాదాల్లోకి లాగుతారు. హీరో నాని సైతం ఈ రాజకీయాలకు బలయ్యారు. అష్టా చెమ్మా చిత్రంతో హీరో అయిన నాని వరుస విజయాలతో పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. అయితే రాజమౌళితో చేసిన ఈగ తర్వాత ఆయనకు పరాజయాలు ఎదురయ్యాయి. రెండు మూడేళ్లు బాగా స్ట్రగులయ్యారు. దర్శకుడు మారుతి బ్రేక్ ఇచ్చాడు. భలే భలే మగాడివోయ్ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కించాడు.
ఒక దశలో నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇలా హిట్టు మీద హిట్టు కొట్టాడు. ఈ సమయంలోనే నాని ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదే బిగ్ బాస్ హోస్ట్ గా మారడం. 2017లో ఫస్ట్ టైం బిగ్ బాస్ షోను తెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి హోస్ట్ గా ఎంచుకున్నారు. ఎన్టీఆర్ అంచనాలు అందుకున్నారు. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని షోని సక్సెస్ చేయడంలో తన వంతు పాత్ర వహించారు.
అయితే నెక్స్ట్ సీజన్ నుండి తప్పుకున్నారు. సినిమాలతో బిజీగా మారిన ఎన్టీఆర్ స్టార్ మా ఆఫర్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ ఆప్షన్ గా హీరో నానిని ఎంచుకున్నారు. ఆ సీజన్ కంటెస్టెంట్స్ లో చాలా మంది కొరకరాని కొయ్యలు. హోస్ట్ కి కూడా చుక్కలు చూపించే టైప్. కౌశల్, బాబు గోగినేని, నూతన్ నాయుడు ఇలా వివాదాస్పద ప్లేయర్స్. వీరితో ఆడుకోవడం చిన్న విషయం కాదు. నాని బేసిక్ గా మంచి వ్యాఖ్యాత. సమయానుకూలంగా, అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న యాక్టర్.

అయితే నాని హోస్టింగ్ బాగోలేదంటూ ఒక ప్రచారం తెరపైకి తెచ్చారు. ఆయన కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. నాని వల్ల కావడం లేదు. ఎన్టీఆర్ లో ఉన్న సత్తా నానిలో లేదు… ఇలాంటి నెగిటివిటీ పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేశారు. ఇవి నాని వరకు వెళ్లాయి. ఆయన ఆత్మ విశ్వాసం దెబ్బతినే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అది ఆయన వీకెండ్ హోస్టింగ్ లో స్పష్టంగా కనిపించేది. ఒకరిని బెస్ట్ అని నిరూపించడం కోసం నానిపై ఓ వర్గం పనిగట్టుకొని విష ప్రచారం చేసిందన్న వాదన ఉంది.
ఆ దెబ్బతో నాని ఈ షో మనకు అనవసరం అనుకున్నారు. మనకు నటన ముఖ్యం. నటుడిగా ఎదగడం ముఖ్యం. ఇలాంటి షోల కోసం టైం కేటాయించి, విమర్శలు ఎదుర్కొని మనసు పాడు చేసుకుంటే… అసలుకే ఎసరు వచ్చేలా ఉంది. కాబట్టి ఇకపై నో బిగ్ బాస్ అనుకున్నారు. ఆ షో వదిలేశారు. ఇక నాని హోస్టింగ్ పై ఎంత దుష్ప్రచారం చేసినా రేటింగ్ మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడని నిరూపించింది.