Actor Ali: పవన్ కళ్యాణ్- అలీ గొప్ప మిత్రులన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ బిగినింగ్ నుండి వీరిద్దరి ప్రయాణం సాగుతుంది. ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ప్రతి మూవీలో అలీకి పాత్ర ఉంది. చెప్పే అవసరం లేకుండా అలీకి ప్రతి దర్శకుడు ఒక రోల్ రాసుకుంటారు. 2018లో విడుదలైన అజ్ఞాతవాసి మూవీలో అలీ నటించలేదు. దానికి కారణం డేట్స్ కుదరకపోవడమే అని గతంలో అలీ సమాధానం చెప్పారు. కాగా అలీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. ఆయనకు ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవి ఇచ్చింది.

రాజకీయంగా పవన్-అలీ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. మిత్రుడు అలీని పవన్ దూరం పెట్టాడనే ప్రచారం జరుగుతుంది. పవన్ గత రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లలో అలీ నటించలేదు. ఇటీవల అలీ తన కూతురు వివాహం ఘనంగా చేశారు. ఈ పెళ్లి వేడుకకు చిత్ర ప్రముఖులు అందరూ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ కారణాలతో పవన్-అలీ విడిపోయారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది.
ఈ ఊహాగానాలకు అలీ స్పష్టత ఇచ్చారు. ఆయన ఆలీతో సరదాగా షోలో గెస్ట్ గా హాజరయ్యారు. యాంకర్ సుమ ప్రశ్నకు సమాధానంగా… పవన్ కళ్యాణ్ తో నాకు ఎలాంటి గ్యాప్ రాలేదు. గ్యాప్ కొందరు క్రియేట్ చేశారు. అది ఎవరో కాదు కేవలం మీడియా. మీడియాలో నిరాధార కథనాలు ప్రచారం చేశారు. అవి జనాలు నిజమని నమ్ముతున్నారు.

నా కూతురు వివాహానికి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ సినిమా సెట్స్ కి వెళ్ళాను. అదే సమయంలో వేరే వాళ్ళు కూడా ఆయన్ని కలిసిందుకు వచ్చారు. వాళ్ళను వెయిట్ చేయమని చెప్పించి, పవన్ నన్ను కలిశారు. దాదాపు 15 నిమిషాలు మేము సరదాగా మాట్లాడుకున్నాము. అనేక విషయాలు చర్చించుకున్నాము. మా అమ్మాయి పెళ్ళికి ఆయన రావాల్సి ఉంది. చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో ఆయన రాలేకపోయారు. మా అమ్మాయి పెళ్లికి పవన్ రాకపోవడానికి కారణం అదే. అంతకు మించి ఎలాంటి విబేధాలు లేవు. పరిశ్రమలో పవన్ నేను ఎప్పటికీ మిత్రులమే అని అలీ చెప్పుకొచ్చారు.