KCR Khammam Sabha: బుధవారం జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఖమ్మం నగరం ముస్తాబయింది. దాదాపు 5 లక్షల మంది దాకా వస్తారని భారత రాష్ట్ర సమితి నాయకులు అంచనా వేస్తున్నారు.. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.. మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మంలోని 10 నియోజకవర్గాల్లో ఒక్కొక్క సెగ్మెంట్ కు ఇద్దరేసి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని, ఇతర నాయకులను కో_ఆర్డినేటర్లుగా నియమించారు.. ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరవుతున్నారు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని చెప్పినప్పటికీ… తర్వాత ఎందుకో రద్దయింది.

వారికే దిక్కు లేదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గోల్డ్ స్కాం, వయనాడ్ సరస్సులో విల్లాల నిర్మాణం వంటి ఉదంతాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయారు. ఆయన మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవరని చెబుతున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో కూరుకు పోయారు.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తుండటంతో ఆయన మంత్రివర్గంలోని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్కూళ్ళ నిర్మాణంలో కూడా అవకతవకలు చోటు చేసుకోవడంతో అరవింద్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనే తిరుగా మారింది. జాబు ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ముఖ్యమంత్రి అయిదు నెలలు గడిచిందో లేదో కానీ అప్పుడే వార్తల్లో వ్యక్తి అయ్యారు.. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మద్యం తాగి పరువు తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి మద్యం తాగి వెళ్లడంతో నానా రచ్చ అయింది. ఇక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. పార్టీలోని కీలక నాయకులు మొత్తం భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు.. పైగా ఇటీవల ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఆ పార్టీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది.. దీంతో అఖిలేష్ యాదవ్ కు ఏం చేయాలో పాలు పోనీ పరిస్థితి ఏర్పడింది.

వీళ్ళు ఏం చేయగలరు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఈ నలుగురు వ్యక్తులను ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నారు.. ఫర్ సపో జ్ రేపటి నాడు కెసిఆర్ కు వీరంతా మద్దతు ఇస్తారా? పోనీ ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి పోటీ చేస్తే….మోస్ట్ వెల్ కం ఆ అంటూ స్వాగతం పలుకుతారా? ఈ ప్రశ్నలకు భారత రాష్ట్ర సమితి నాయకుల వద్ద సమాధానం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో పరస్పరం అవసరాలు మాత్రమే ఉంటాయి.. వాటిలో త్యాగాలకు చోటు లేదు. వర్తమాన రాజకీయాలు అలా మారాయి కాబట్టి… ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. అసలు అధికారం అనేది లేకుంటే క్షణం కూడా ఉండలేని నాయకులు రేపటి నాడు మద్దతు ఇస్తారని కేసీఆర్ ఎలా అనుకుంటారు? ఇలాంటి వ్యక్తులతో కలిసి దేశంలో గుణాత్మక మార్పు ఏ విధంగా తీసుకురాగలుగుతారు? అంతా “బభ్రజమానం భజ గోవిందం!”