Kajal Aggarwal: మానవత్వం నశించిపోతుంది. జంతువుల మాదిరి మనుషులు కూడా హింసకు గురవుతున్నారు. మనుషులు రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు యువకులు ఓ అమ్మాయిని దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒంటరైన ఒక యువతిని పొలాల్లో కర్రలతో యువకులు గొడ్డును కొట్టినట్లు కొడుతున్నారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ యువతి కేకలు వేస్తూ ఏడుస్తుంది. అత్యంత పాశవికంగా ఉన్న ఆ వీడియోని టొరంటో సన్ కాలమిస్ట్ తారిఖ్ ఫతాహ్ షేర్ చేశారు. భారతీయ సంస్కృతి, నాగరికతకు అవమానం అంటూ ఆ వీడియోపై కామెంట్ చేశారు.

పెద్ద దుమారం రేపిన ఆ వీడియోపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టార్ లేడీ కాజల్ అగర్వాల్ సైతం స్పందించారు. ఒక అమ్మాయి పట్ల ఘోరంగా వ్యవహరించిన తీరు ఆమె ఆవేశం కట్టలు తెచ్చుకునేలా చేసింది. పరుష పదజాలంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నారు. వాట్ ద ఫ***. ఈ రాక్షసులకు గుణపాఠం చెప్పాలి. కారణం ఏదైనా వారి చర్యలు దారుణం. మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇది అత్యంత బాధాకరం, అంటూ ట్వీట్ చేశారు.
చాలా సాఫ్ట్ గా కనిపించే కాజల్ అగర్వాల్ అంతగా కోప్పడ్డారంటే ఆ వీడియో ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా అనాగరికం కొన్ని చోట్ల అలానే ఉంది. మారుమూల ప్రాంతాల్లో మహిళలు, మైనారిటీ ప్రజలు హింసకు, నిరాదరణకు గురవుతున్నారు. ఇండియాలోని పల్లెల్లో అవమానాలు, అణచివేతను అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని కనీసం కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఆ వీడియోని షేర్ చేశారు. సంబంధిత అధికారులు ఈ దుర్మార్గులను పట్టుకొని చంపేయడంటూ సీరియస్ కామెంట్ చేశారు. ఇక ఆ వీడియో ఎప్పటిది? ఎక్కడ జరిగింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వీడియోలో ఉన్న యువతి, యువకుల వివరాలు తెలుసుకోవడం కొంచెం కష్టమైన వ్యవహారమే. మరి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన ఈ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి. వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
WTF. These monsters need to be taught a lesson. No reason is a reason for such monstrosity 😨😡🤬 it’s saddening how we forget humanity every now and again. https://t.co/9viaOUXyZf
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 4, 2023