
CM KCR: బంగారు తెలంగాణ అయిపోయింది. ఇక దేశానికి ప్రధానమంత్రి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే తన పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత్ అని చేర్చారు.. కానీ ఎన్నికల సంఘం కెసిఆర్ గాలి తీసేసింది. నీది జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ అని తేల్చి చెప్పింది. దీంతో కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మహారాష్ట్రలో తమ పార్టీకి గొప్ప ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థను ముందించిన నేపథ్యంలో తమకు అక్కడ కూడా ప్రజలు స్వాగతం పలుకుతారని కెసిఆర్ మనసులో మాటగా ఉంది.
అయితే ఈ క్రమంలో తాను తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం, దళిత బంధు పథకం ఓట్లు రాల్చుతాయని కేసీఆర్ నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాదు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలను రైతుబంధు, రైతు బీమా పథకానికి ఖర్చు చేశామని చెప్తున్నారు. ఇదే తీరుగా దేశం మొత్తం ఖర్చు చేస్తే రైతుల బతుకులు బాగుపడతాయని కేసీఆర్ అంటున్నారు. అందుకే తాను తెలంగాణలో అమలు చేసి దేశ మొత్తం అమలు చేసేందుకు కొట్లాడుతానని కేసీఆర్ చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 4,000 మందికి దళిత బంధు ఇచ్చామని, వారి జీవితాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిందని కేసీఆర్ వివరిస్తున్నారు. ఇలాంటి పథకాన్ని దేశం మొత్తం అమలు చేస్తే దేశంలో దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయని కేవిసిఆర్ భావిస్తున్నారు.
అయితే ఈ పథకాలకు సంబంధించి కెసిఆర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన స్రవంతి మీడియాకు ప్రకటనలు కూడా ఇచ్చారు. గతంలో వైబ్రంట్ గుజరాత్ మోడల్ ను నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసుకొని దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన దారిలోనే కెసిఆర్ వెళ్తున్నారు. తాను తన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకాల వల్ల తెలంగాణ బంగారు తెలంగాణ అయిందని, ఆ పథకాలు దేశం మొత్తం అమలు చేస్తే బంగారు భారత్ అవుతుందంటూ కేసీఆర్ కితాబు ఇస్తున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇలా డబ్బులు పంచుకుంటూ పోతే దేశం మరో వెనిజులా అవుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెనిజులా దేశంలో గతంలో ఇలాంటి పథకాలు చేపట్టారని, ఫలితంగా ఆదేశం అప్పులపాలైందని గుర్తు చేస్తున్నారు. లక్షిత వర్గానికి మంచి చేయడం గొప్ప ఆలోచన అయినప్పటికీ, కానీ ఈ విధానం సరైంది కాదని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి నిర్మాణం లేకపోవడంతో కర్ణాటక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పోటీ చేయలేకపోతోంది. అటు కుమారస్వామి కూడా అంతంత మాత్రమే మద్దతు ఇస్తోంది. ఇలాంటప్పుడు కెసిఆర్ ఎలా ప్రధాని అవుతారని ఇప్పుడు ప్రధాన ప్రశ్న.