Chicken- Marriage: ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద రాద్ధాంతాలుగా మారతాయి. విషయం చిన్నదే కానీ దాని మీద పెద్ద గొడవే జరుగుతుంది. ఎవరు కాంప్రమైజ్ అయినా ఫర్వాలేదు కానీ ఎవరు కూడా తగ్గరు. ఎవరి ఈగో వారిదే. తగ్గేదేలే అంటూ ఇరు వర్గాలు బెట్టు చేస్తే చివరకు ఫలితం కఠినంగానే ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎక్కడైనా వరకట్నం డబ్బు ఇవ్వలేదని, కానుకల విషయంలో మాకు అన్యాయం జరిగిందనే విషయాల మీద పెళ్లిళ్లు వాయిదా పడుతుంటాయి. ఇక్కడ మాత్రం ఓ భిన్నమైన సంఘటన జరిగింది. అదేంటో తెలుసుకుందాం.

నగరంలో నవంబర్ 28న జరగాల్సిన పెళ్లికి ఒక రోజు ముందే వరుడి బంధువులు కుత్బుల్లాూర్ కు చెందిన వధువు ఇంటికి చేరుకున్నారు. దీంతో పెళ్లి కోసం జగద్గిరిగుట్టకు చెందిన వరుడి స్నేహితులు వచ్చారు. మార్వాడి కుటుంబాలు కావడంతో ఏర్పాట్లు ఘనంగానే చేశారు. కానీ విందులో చికెన్ ఎందుకు పెట్టలేదని వరుడి స్నేహితులు నిలదీశారు. దానికి వధువు కుటుంబసభ్యులు పెట్టలేదని సమాధానం ఇవ్వడంతో వారు అలిగి వెళ్లారు. దీంతో వరుడు కూడా వారికి చికెన్ ఎందుకు అందించలేదని పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో రెండు కుటుంబాల్లో నిశ్శబ్ధం చోటుచేసుకుంది.
విషయం కాస్త పోలీసులకు చేరింది. ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి తంతును జరిపించాలని కోరారు. దీంతో వధువు కటుంబం అంగీకరించింది. వరుడు కూడా ఓకే చెప్పడంతో ఒక రోజు ఆలస్యంగానైనా వివాహం మాత్రం జరిపించారు. చికెన్ కోసం ఇగోకు పోయి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం వివాదాలకు కారణమైంది. పెళ్లి కూతురు కుటుంబం కూరగాయల భోజనం పెట్టడం గొడవకు దారి తీసింది. పెళ్లి కొడుకు స్నేహితులు లొల్లి పెట్టడంతో ఇంత రాద్ధాంతం జరిగింది. పెళ్లి బుధవారం 30న జరగనుంది.

చికెన్ పెట్టలేదని అలిగి పెళ్లిని రద్దు చేసుకునే వరకు వెళ్లడం ఇరు కుటుంబాలకు ఆలోచన లేకుండా పోయింది. ఇంత చిన్న విషయానికి పెళ్లి కుమారుడు పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పడం అతడి ఆలోచన ధోరణిని బయటపెడుతోంది. ఏదో వారు అడిగారు వీరు కూడా గొడవకు పోకుండా ఓ ఐదు కిలోల చికెన్ తెచ్చి పెడితే పోయేదేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు రాజేసి తమలోని రాక్షస ప్రవృత్తిని బయటపెట్టుకుంటున్నారు. సాధారణంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం కూడా అక్కడే దొరుకుతుంది. దీనికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పని లేదు. కానీ ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్ కు చేరడంతో విషయం కాస్త ప్రపంచానికి తెలిసింది.