
TSPSC Paper Leak Issue: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకైన విషయాన్ని తామే పసిగట్టామని కమిషన్ అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయి విషయాలు వాటిని బలపరచడం లేదు. ఎందుకంటే ఈ కేసులో నిండితుడైన ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం వల్లే ఈ విషయం తెలుగులోకి వచ్చింది. మార్చి 5వ తేదీన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైన ఘటనలో డబ్బు చెల్లింపునకు సంబంధించి నిందితుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం పోలీసులకు చేరింది. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుక.. తన సోదరుడు రాజేష్ నాయక్ కోసం టీఎస్ పీఎస్సీ లో పని చేసే ప్రవీణ్ ద్వారా ప్రశ్నపత్రాన్ని సంపాదించింది. కాగా ఈ ప్రశ్న పత్రాన్ని తమ తండా కే చెందిన నీలేష్, శ్రీను, రాజేందర్ నాయక్ లకు ఇచ్చేందుకు లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమేరకు పరీక్షకు ముందు రోజు వీరందరినీ వనపర్తి లోని తన ఇంటికి పిలిపించుకొని అక్కడ వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్ చేయించింది. పరీక్ష రోజు తన కారులోనే వారిని హైదరాబాద్కు తీసుకెళ్లి పరీక్ష రాయించుకుని తీసుకొచ్చింది.
కాగా, ఒప్పందం ప్రకారం పరీక్షకు ముందు ఒక్కొక్కరు రేణుకకు రెండు లక్షల చొప్పున చెల్లించారు.. మిగిలిన మొత్తాన్ని పరీక్ష పూర్తయ్యాక ఇస్తామని చెప్పారు. దీంతో పరీక్ష ముగిసిన రోజు రాత్రి వనపర్తిలో రేణుక ఇంట్లో జరిగిన డిన్నర్ తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగింది. అయితే తమ వద్ద డబ్బు లేదని, ఇవ్వలేమని వారు చేతులెత్తేశారు. ఇంత వారికి, రేణుకకు తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. నీలేశ్ నాయక్ డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు విషయం మొత్తం చెప్పాడు. పోలీసులు వెంటనే స్పందించి రేణుక, ఆమె సోదరుడు, నీలేష్, మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
రేణుకకు, ప్రవీణ్ కు ఏర్పడిన పరిచయం చాలా విచిత్రం. రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా చేరిన తర్వాత ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడింది. దానిని సరిచేసుకునేందుకు ఆమె టీఎస్ పీఎస్సీ ని సంప్రదించింది. పలుమార్లు కార్యాలయానికి వెళ్ళింది. ఆ క్రమంలో ఆమెకు ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది. అది స్నేహానికి దారితీసింది. తర్వాత శారీరక బంధం ఏర్పడింది. ప్రతి శనివారం సాయంత్రం గండిడ్ నుంచి హైదరాబాద్ వచ్చేది. ఆదివారం మొత్తం ప్రవీణ్ తో గడిపి.. సోమవారం ఉదయం గండీడ్ వెళ్లిపోయేది. కేవలం రేణుక మాత్రమే కాదు ఇలా చాలామందితో ప్రవీణ్ సానిహిత్య బంధాన్ని కొనసాగించాడని తెలుస్తోంది.

ప్రవీణ్ మంది మహిళలతో కాంటాక్ట్ లో ఉండేవాడు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన సందేశాలు, నగ్న చిత్రాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రవీణ్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లు , చాటింగ్ లు చేస్తున్న వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్టు సమాచారం. సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్ కు కాంటాక్ట్ లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ 60 మందిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు 2017 నుంచి ప్రవీణ్ మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు రికవరీ చేసే పనిలో ఉన్నారు.. 2017 నుంచి టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని పరీక్షలు జరిగాయి? ఆ సమయంలో ప్రవీణ్ ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన ఏ_2 నిందితుడు, నెట్ వర్క్ అడ్మిన్ గా పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆట్ల రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజు బిజెపిలో క్రియాశీలకంగా పని చేస్తున్న వ్యక్తిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న యువతను తమవైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, రాజును అడ్డం పెట్టుకొని పేపర్ లీకేజీకి పక్కాగా ప్లాన్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బిజెపికి అనుకూలంగా రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోస్టులను, బిజెపి నాయకులతో రాజు దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.