Secret Mound Of Kakatiya Period: కాకతీయుల కళావైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి చరిత్రకు సాక్ష్యంగా రామప్ప, వేయిస్తంభాల గుడులు, ఖిలా వరంగల్ కోట, శత్రుదుర్భేద్యంగా ఉన్న కట్టడాలు మనకు కనిపిస్తున్నాయి. వారి కళా వైభవానికి ప్రతీకగా ఎన్నో కట్టడాలు మనకు ఉమ్మడి వరంగల్ లో కనిపిస్తాయి. రామప్ప దేవాలయం ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. మన శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఎన్నో వింతలు, విశేషాలు ఇక్కడ కనిపించడం విశేషం. కాకతీయుల నైపుణ్యం సామాన్యమైనది కాదు. వారి కళా ఖండాలు మనకు చూపుతున్న అద్భుతాలతో అబ్బురపడాల్సిందే.
VARALA GUTTA
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామప్ప దేవాలయం దగ్గర వరాల గుట్ట ఉంది. ఇక్కడ కాకతీయులు వజ్రాలు సానబట్టారని కథలు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయుల సంపదను ఇక్కడే దాచారని తెలుస్తోంది. కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రం కనిపించవు. గుట్ట చుట్టూ రాతి కట్టడంతో ప్రహరీ నిర్మించినట్లు కనిపిస్తుంది. కానీ ఇది ఎందుకు నిర్మించారనే దానిపై స్పష్టత లేదు, అంతేకాదు సమ్మక్క సారలమ్మ లు కాకతీయులతో చేసిన యుద్ధంలో ఇక్కడే సేదతీరారనే కథ కూడా ఉంది.
Also Read: Analysis on Agneepath Scheme : అగ్నిపథ్ అంటే ఏమిటీ? దేశానికి దీనివల్ల లాభమా? నష్టమా?
వరాల గుట్ట కాకతీయుల ధాన్యాగారమా? వారి వజ్ర వైడూర్యాలు దాచిన స్థావరమా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. గుట్ట చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బండరాళ్లతో నిర్మించిన ప్రహరీకి ఆ రాళ్లు ఎలా తెచ్చారనే అనుమానాలు వస్తున్నాయి. గుట్ట చుట్లు నిర్మించిన ప్రహరీ శత్రువులు రాకుండా సైనికులను ఇక్కడ కాపలా ఉంచినట్లు భావిస్తున్నా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు మాత్రం కానరావు. దీంతో వారి వ్యూహమేంటనేది ఇప్పటికి కూడా అంతుచిక్కని ప్రశ్నే.
VARALA GUTTA
గుట్ట మీద ఓ మంచినీటి బావి ఉంది. అంత ఎత్తులో బావి నిర్మించడం ఓ సాహసమే. కానీ సైనికులు కాపలా కాస్తున్న వారి దాహం తీర్చేందుకు బావి తవ్వినట్లు తెలుస్తోంది. కాకతీయుల పనితీరుకు అందరు ముగ్దులు కావాల్సిందే. అంత ఎత్తులో బావి నిర్మాణం చేయడం వారి పనితనానికి నిదర్శనమే. గుట్ట మీద జనం ఉండేవారని అక్కడి గుర్తుల ద్వారా అవగతమవుతోంది. దీంతో వారి పాలన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందే.
రామప్ప గుడి నిర్మాణం సమయంలోనే కాకతీయ సేనాని రేచర్లరుద్రుడు ఇక్కడ రహస్య స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క సారలమ్మలతో జరిగిన యుద్ధంలో సైనికులు ఇక్కడ సేద తీరారని ఓ కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ ధాన్యం ఆరబోశారని అందుకే వారి ధాన్యాగారంగా ఉండేదని కూడా మరో కథ ప్రాచుర్యంలో ఉంది. కాకతీయుల సంపద ఇక్కడే దాచిపెట్టారనే వాదన కూడా ప్రచారంలో ఉండటం గమనార్హం. కాకతీయుల నిర్మాణాల్లో ఈ గుట్ట కూడా ప్రధాన భూమిక పోషించిందని తెలుస్తోంది.
VARALA GUTTA
ఇక్కడ ఓ రైతు మొక్కజొన్న పంట వేస్తే వాటికి కంకులకు బదులు వజ్రాలు కాశాయని దీంతో వాటిని దొంగలు ఎత్తుకుపోతారనే భయంతో గుట్టపైన నూర్పిడి చేశాడనే కథ ప్రచారంలో ఉంది. గుట్టపైన దేవత గుడి ఉండేదట. ఆ దేవత కోరిన కోర్కెలు తీర్చేదట. ఏ వరం అడిగినా అది తీర్చేదట. అందుకే ఈ గుట్టకు వరాల గుట్ట అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు. ఇలా వరాల గుట్ట గురించి ఎన్నో రకాల కథలు ప్రచారంలో ఉండటం తెలిసిందే.
వరాల గుట్టను కూడా పర్యాటక కేంద్రంగా చేస్తే మరింత ప్రయోజనం కలిగే అవకాశముంది. కాకతీయ రాజుల విశిష్టత కోసం ఈ గుట్టను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి అక్కడ పలు కార్యక్రమాలు చేపడితే ఎంతో లాభం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వరాల గుట్టను అభివృద్ధి చేస్తే మరింత ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.
Also Read: Vizianagaram TDP: విజయనగరం టీడీపీలో వర్గపోరు.. అధినేత ఎదుటే బలప్రదర్శన