
BRS ON Media: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల గడువే ఉంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు వరుస తప్పిదాలు.. చుట్టు ముడుతున్న వివాదాలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సొంత సర్వేలు కూడా ఆశాజనకంగా లేవు. దీంతో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దృష్టిపెట్టారు. ప్రజలను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన మీడియాను తన గుప్పిట పెట్టుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు షురూ చేసింది.
అన్నీ ‘నమస్తే’ కొట్టాలని…
తెలంగాణలో ఉన్న తెలుగు మెయిన్ స్ట్రీం మీడియా అంతా ఆంధ్రా యజమానుల చేతుల్లోనే ఉంది. మొదటి నుంచి ఆ యాజమాన్యాలకు కేసీఆర్ అంటే భయమే. నెగెటివ్ వార్తల తీవ్రత తగ్గించి ప్రచురితం చేయడం సదరు మీడియాకు అలవాటైంది. అప్పుడప్పుడు ఒకటి రెండు పత్రికలు ఘాటైన, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసినా.. వెంటనే బీఆర్‌ఎస్ ‘బలగం’ రంగంలోకి దిగుతుంది. తాయిలాలు ఇచ్చేస్తుంది. అయితే బీఆర్‌ఎస్‌కు సొంత మీడియా ఉంది. నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూస్ చానెల్ ఉన్నాయి. అయితే ఆ పత్రికను చదివేవారు గానీ, చానెల్ చూసేవారుగానీ లేరు. దీంతో అధికార పార్టీ మీడియా తెలంగాణ ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ క్రమంలో మెయిన్ స్ట్రీం మీడియా మొత్తం తమకే ‘నమస్తే’ కొట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇందుకోసం యాజమాన్యాలతో ఆ పార్టీ ముఖ్యమైన నేత మంతనాలు జరుపుతున్నారు. తాయిలాలు ప్రకటిస్తున్నారు. దీంతో అన్ని పత్రికలు, టీవీ చానెళ్లు ‘నమస్తే ……’(ఈ ఖాళీలో ఏ పేపర్ పేరైనా పెట్టుకోవచ్చు) గా మారిపోతున్నాయి.
సోషల్ మీడియాను వదలకుండా..
ఇక మెయిన్ స్ట్రీం మీడియా అంతా అధికార పార్టీ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. దొరల గడీలో దాదాపు బంధీ అయింది. ఈ క్రమంలో మెయిన్‌స్ట్రీం మీడియాతో సమానంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాపై కూడా ముఖ్యమైన నేత దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ చానెల్ యజమానికి రూ.5 కోట్ల ఆఫర్ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సదరు చానెల్ ఇప్పుడు అధికార పార్టీ మోచేతినీళ్లు తాగిన కృతజ్ఞత చూపుతోంది. ఇలా కాస్తో, కూస్తో వ్యూవర్‌షిప్ ఉన్న సోషల్ మీడియా చానెళ్లన్నింటినీ బీఆర్‌ఎస్ కొనేస్తోంది. కనీసం 10 వేల వ్యూవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఉన్న చానెళ్లన్నిటికీ బీఆర్‌ఎస్ నుంచి తాయిలాలు అందినట్లు తెలుస్తోంది. సదరు చానెళ్ల యజమానులు కూడా వాటిని పుచ్చుకుని ‘నమస్తే’ చెబుతున్నారు.

లొంగని మీడియాపై కక్షసాధింపు..
అయితే తెలంగాణలో కొన్ని మెయిన్ స్ట్రీం పేపర్లు, టీవీ చానెళ్లతోపాటు సోషల్ మీడియా చానెళ్లు అధికార పార్టీ తాయిలాలకు లొంగడం లేదు. ఇలాంటి వాటిపై అధికార పార్టీ కక్షసాధింపు మొదలు పెట్టింది. బహిష్కరిస్తాం.. మూసేస్తాం అంటూ మంత్రులే బెదిరింపులకు దిగుతున్నారు. ఓ సోషల్ మీడియా అధినేతను కూడా పోలీసులతో తప్పుడు కేసులో అరెస్ట్ చేయించింది.
ఇలా మీడియాను గుప్పిట పెట్టుకుని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న అధికార పార్టీ… ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి!