
Modi Govt- Cryptocurrency: బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల ద్వారా జరిగే అక్రమాలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. వర్చువల్ కరెన్సీల లావాదేవీలను మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో క్రిప్టోకరెన్సీల లావాదేవీలకు వీలు కల్పించే ఎక్స్ఛేంజ్‌లు ఎప్పటికప్పుడు అనుమానిత లావాదేవీల వివరాలను కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా(ఎఎఫ్ యూ-ఇండ్)కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు సంస్థలు క్రిప్టో కరెన్సీల కస్టోడియన్లు, వాలెట్ ప్రొవైడర్స్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. క్రిప్టో కరెన్సీ సేవలందించే ఎక్స్ఛేంజ్‌లు, ఇతర సంస్థలు (ఇంటర్మీడియరీలు) తప్పనిసరిగా తమ ఖాతాదారులు, లబ్దిదారుల కేవైసీ వివరాలు నమోదు చేసి భద్రపరచాలని ప్రభుత్వం చెబుతోంది.
కేవైసీ వివరాలు అందుబాటులో లేకపోతే కనీసం వారి గుర్తింపునకు దోహదం చేసే డాక్యుమెంట్లు, ఖాతాల ఫైళ్లు, వ్యాపార లావాదేవీల వివరాలను ఐదేళ్ల పాటు భద్రపరచాలని కోరింది. రూ.10 లక్షలకు మించిన ప్రతి క్రిప్టో లావాదేవీ వివరాలను ఎక్స్ఛేంజ్‌లు తప్పనిసరిగా భద్రపరచాలి. ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి సంస్థలు, నగల వ్యాపారులు, జూద గృహాలు మాత్రమే ఒక స్థాయికి మించిన అనుమానిత ఆర్థిక లావాదేవీలను పీఎంఎల్‌ఐ చట్టం కింద (ఎఫ్‌ఐయూ-ఇండ్)కు తెలియజేస్తున్నాయి. ఇక క్రిప్టో కరెన్సీ లావాదేవీల సంస్థలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఈ చర్యలతో క్రిప్టోల ద్వారా జరిగే ఆర్థిక నేరాలకు చాలా వరకు తెరపడుతుందని భావిస్తున్నారు.
తీవ్రవాదులు, ఆర్థిక నేరస్థులు హవాలాకు బదులు, క్రిప్టోల ద్వారా విదేశాల నుంచి నిధులు అందుకోవడం, లేదా విదేశాలకు పంపించడం చేస్తున్నారు. దీంతో వీరి లావాదేవీలను పసిగట్టడం దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది.
దేశంలోని ఉగ్రవాదులకూ క్రిప్టోల రూపంలో పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో క్రిప్టో లావాదేవీలను మనీలాండరింగ్ పరిధిలోకి తేవడం ద్వారా వారికి చెక్‌పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో..
అమెరికా, ఐరోపా సమాఖ్యలోని దేశాలు క్రిప్టోకరెన్సీలను నిషేధించక పోయినా, వాటి లావాదేవీలపై పటిష్ఠమైన పర్యవేక్షణ ఏర్పాటు చేశాయి. దీంతో ఆ దేశాల్లో జరిగే క్రిప్టో లావాదేవీల వివరాలన్నీ దర్యాప్తు సంస్థలకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఇప్పటి వరకు ఆ అవకాశం లేకుండా పోయింది. బ్లాక్ చెయిన్ వంటి ఆధునిక టెక్నాలజీ సాయంతో జరిగే వీటి లావాదేవీల వివరాలు కనుక్కోవడం దర్యాప్తు సంస్థలకూ సవాల్‌గా మారింది. దీంతో గొలుసు కట్టు పథకాల్లా మారిన క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని ఆర్‌బీఐ కోరుతోంది.
జీ-20 సమావేశాల నేపథ్యంలో..
క్రిప్టోలపై వేటు అంతర్జాతీయ స్థాయిలో జరగాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ఇప్పటి వరకు నాన్చారు. ఇప్పుడు పీఎంఎల్‌ఏ పరిధిలోకి తెస్తున్నట్టు ప్రభు త్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జీ-20 సమావేశాల్ల్లో అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.