HomeజాతీయంFake News: ఇక ఏది పడితే అది రాయడం కుదరదు.. సోషల్ మీడియాకు, మీడియాకు ఇదే...

Fake News: ఇక ఏది పడితే అది రాయడం కుదరదు.. సోషల్ మీడియాకు, మీడియాకు ఇదే కేంద్రం హెచ్చరిక

Fake News
Fake News

Fake News: విపక్షంలో ఉన్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛను కోరుకుంటాం. ప్రభుత్వాలు ఏ మాత్రం ప్రతికూలంగా వ్యవహరిస్తే గొంతు చించుకొని రంకెలు వేస్తాం. అదే అటుదిటైతే మాత్రం మన భావాలు, అభిప్రాయాలు మారిపోతుంటాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వస్తే మరోలా వ్యవహార శైలి నడుస్తుంటుంది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తుంది ఇదే. అది 2014కు ముందు.. సోషల్ మీడియా ఎంటరవుతున్న రోజులవి. కొత్తపుంత తొక్కుతున్న సమయమది. నాడు ఈ దేశానికి భావి నాయకుడిగా నరేంద్ర మోదీని చూపించడంలో మీడియా, సోషల్ మీడియాదే కీలక పాత్ర. అవి వేసిన పునాదులపైనే ఇప్పుడు మోదీ రాజకీయ సామ్రాజ్యాన్నే ఏర్పాటుచేసుకున్నారు. నాడు అక్కరకు వచ్చిన మీడియా, సోషల్ మీడియాయే ఇప్పుడు మోదీ సర్కారుకు నలుసుగా మారినట్టుంది. అందుకే మీడియాపైనే ఆంక్షలు మొదలుపెట్టింది.

ఇక ఏది పడితే అది రాస్తాం.. చూపిస్తాం అంటే కుదరదు. ఫేక్ అని తేలితే మాత్రం ఆ వార్తను ప్రచురించకూడదు.. ప్రసారం చేయకూడదు.కేంద్రంలోని మోదీ సర్కారు కఠిన ఆంక్షలకు సిద్ధపడింది. కొత్త రూల్స్ ను తెరపైకి తెచ్చింది. సమాచార చట్టాన్ని సవరిస్తూ మోదీ సర్కారు ఒక ముసాయిదా ప్రతిని సిద్ధం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ కు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. వారు వార్తను ఫేక్ అని నిర్థారిస్తే అది ఏ మాధ్యమంలోనైనా ప్రచారం చేయడానికి వీలులేదు. ముసాయిదా చట్టంలోని నిబంధనలను చేర్చింది. 2021 ఐటీ రూల్స్ కు సవరణ చేసి ముసాయిదా ప్రతిని విడుదల చేసింది. స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది.

పీఐబీలోని ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌కు ‘నకిలీ వార్తల’ను గుర్తించే పని అప్పగించింది. ఇలా గుర్తించిన వార్తల్ని సోషల్‌మీడియా, న్యూస్‌ వెబ్‌పోర్టల్స్‌ ప్రచురించరాదు. ఒకవేళ ప్రచురిస్తే.. వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీ అయిన పీఐబీకి న్యాయ అధికారం కల్పించటాన్ని మీడియా సంఘాలు తప్పు పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రం తీరు చూస్తుంటే మాత్రం తప్పకుండా అమలుచేయాలన్న సంకల్పం కనిపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు చెప్పుచేతల్లోకి వచ్చాయి. రకరకాల ప్రయోజనాలు ఆశించి సదరు మీడియా సంస్థలు ప్రభుత్వానికి అన్నవిధాలా సహాయం అందిస్తుండడంతో సరికొత్త రూల్స్ అమలుకు అడ్డు చెప్పేవారు ఉండరు అన్నది కేంద్ర ప్రభుత్వ ధీమా.

Fake News
Fake News

అయితే ఏ ప్రభుత్వం అయినా తమ వైఫల్యాలను, పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపితే అవి ఫేక్ వార్తలుగా పరిగణిస్తాయి. ఇప్పుడు మోదీ సర్కారు కూడా అందుకు అతీతం కాదు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా మీడియాను నియంత్రించాలన్న భావనతో తీసుకొచ్చిన నిబంధనలే ఇవి. నాడు తన రాజకీయ ఉన్నతికి ఎంతగానో సహకరించిన ప్రసార మాధ్యమాలు ఇప్పుడు చెవిపోటుకు కారణమవుతున్నాయని గుర్తించడం బాధాకరం. దీనిపై ప్రముఖ జర్నలిస్టులు, మీడియా సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముసాయిదాలో వివాదాస్పద అంశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర చర్యలు చూస్తుంటే మాత్రం తలొగ్గే చాన్స్ కనిపించడం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular