Naresh Pavitra Lokesh : నరేష్-పవిత్ర లోకేష్ వివాహ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. త్వరలో నరేష్ పవిత్ర లోకేష్ మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. చాలా కాలంగా పవిత్ర లోకేష్-నరేష్ సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని నరేష్ స్వయంగా తెలియజేశారు. నమ్మదగిన, ప్రేమించే ఒకరి తోడు కావాలి. అందుకే పవిత్ర లోకేష్ నేను కలిసి జీవిస్తున్నామని నరేష్ వెల్లడించారు. పెళ్లితో వారి బంధాన్ని ఆయన అధికారికం చేయనున్నారు. ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ నాలుగో వివాహానికి సిద్ధం కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. అసలు నరేష్ ఎలాంటి వ్యక్తి? ముగ్గురు భార్యలతో విడిపోవడానికి కారణాలు ఏమిటీ?… అనే ప్రశ్నలు అందరి మదిలో నెలకొన్నాయి.

కాగా గతంలో నరేష్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ముగ్గురు భార్యాలతో విడాకులకు కారణాలు వెల్లడించారు. తనకు మొదటి వివాహం చాలా చిన్న వయసులో జరిగినట్లు నరేష్ చెప్పారు. 17 ఏళ్లకే నేను హీరో అయ్యాను. 19 ఏళ్ళ వయసులో పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నాకు బాల్య వివాహం జరిగింది. తర్వాత నా భార్యకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ కారణాలతో ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది.
అనంతరం ఇద్దరు భార్యలతో మనస్పర్థలు వచ్చి విడిపోయాను. ఈ విషయంలో ఎవరినీ నిందించడానికి లేదు. గతంలో ఒక ఫ్యామిలీ కోర్ట్ ఉండేది. ఇప్పుడు పదుల సంఖ్యలో ఉన్నాయి. కారణం… విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. వ్యవస్థలో వచ్చిన మార్పులు దానికి కారణం. పూర్వం భర్త బయట పని చేసి వస్తే.. భార్య గృహిణిగా ఇంటి బాధ్యతలు మాత్రమే చూసుకునేది. ఇప్పుడు భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కుటుంబాలు పెరిగాక దంపతుల మధ్య గొడవలు తీర్చే వారు లేకుండా పోయారు.
నన్ను పరిశ్రమలో ప్లే బాయ్ అనుకోవచ్చు. అలాంటిదేమీ లేదు. విడాకులు ఇచ్చినప్పటికీ నా మాజీ భార్యలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముగ్గురు భార్యలకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయి నవీన్ విజయ కృష్ణ ఎడిటర్, మరో అబ్బాయి పెయింటింగ్ ఆర్టిస్ట్… మూడో భార్యకు పుట్టిన వాడు పసిప్రాయంలో ఉన్నాడని, నరేష్ చెప్పుకొచ్చారు. ఇక తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని నరేష్ ఒకటి రెండు సందర్భాల్లో చెప్పాడు. పెళ్లి కలిసి జీవించడానికి ఒక లైసెన్సు మాత్రమే అన్న నరేష్… పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించడం విశేషం.