TDP- JanaSena Activists: ఇన్నాళ్లు టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావించారు. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అనుకున్నారు. కానీ ఇంతలోనే రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. అమెరికాలోని డల్లాస్ వేదికగా జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ చెలరేగడంతో బాహాబాహీకి సిద్ధపడ్డారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన చిరంజీవి, పవన్ కల్యాణ్ పోస్టర్లను బాలకృష్ణ అభిమానులు చించేయడంతో రగడ రేగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ముష్టిఘాతాలకు దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది.

ఈవెంట్ మేనేజర్లపై టీడీపీ నేత కేసీ చేకూరి దాడి చేయడం సంచలనం సృష్టించింది. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. చేకూరికి బెయిల్ తీసుకొచ్చేందుకు తానా పెద్దలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో డిసెంబర్ 31న రాత్రి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని రెండు పార్టీల కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఓ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ ఎన్నారై కేసీ చేకూరి మద్యం మత్తులో జై బాలయ్య అంటూ అక్కడే ఉన్న పవన్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు.
దీంతో వారు కూడా జై పవన్ అంటూ నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బాలయ్య అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలగాజనం అంటూ బాలయ్య తిట్టినా కాళ్ల దగ్గరకు వచ్చిన పవన్ అంటూ టీడీపీ సభ్యులు చులకన చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. వివాదం పెద్దది కావడంతో ఈవెంట్ మేనేజర్లు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా చేకూరి తగ్గలేదు. అందరిపై పిడిగుద్దులు కురిపించారు.

దీంతో చేకూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణ సందర్భంగా చోటుచేసుకున్న గొడవలో చేకూరి పాత్రే కీలకం కావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. జనసేన సభ్యులతో రాజీకి ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదు. దీంతో కేసు పెద్దదయింది. చేకూరిని బయటకు తీసుకొచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ జనసేన నాయకులు మాత్రం చేకూరిని లోపలే ఉంచేలా చూడాలని చూస్తున్నారు. రెండు పార్టీల మధ్య గొడవకు కారణమైన చేకూరికి బెయిల్ రానీయకుండా జనసేన కార్యకర్తలు కూడా పట్టుబడుతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య జరిగిన గొడవతో విషయం ఎక్కడికి పోతుందో తెలియడం లేదు.