TCS Layoffs: భారతీయ ఐటీరంగంలో అతిపెద్ద సంస్థగా టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)కుగుర్తింపు ఉంది. అయితే టీసీఎస్‌లో ఇటీవల జరిగిన ఉద్యోగాల తొలగింపులు ఐటీ రంగంలో తీవ్ర చర్చలకు దారితీశాయి. అధికారికంగా ప్రకటించిన సంఖ్యలు ఒక వైపు ఉండగా, సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్లు మరోవైపు ఉద్యోగుల్లో ఆందోళనలను పెంచుతున్నాయి. అధికారిక డేటా ప్రకారం.. 2025 ఆగస్టులో సుమారు 12 వేల నుంచి 12,261 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో 2% మాత్రమే అని టీసీఎస్ తెలిపింది. ఇది భవిష్యత్ సిద్ధత కోసం జరిగిన పునర్నిర్మాణం అని వివరించింది.
సోషల్ మీడియాలో ఇలా..
అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ సంఖ్య ఎంతో అతిశయోక్తిగా చూపబడుతోంది. కొందరు 30 వేల మంది అని, మరికొందరు 50 వేల నుంచి 80 వేల వరకు తొలగించినట్లు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు, ఒక ఎక్స్ యూజర్ తన కాలేజ్ ఫ్రెండ్ నుంచి వచ్చిన సమాచారంతో 80 వేల మంది ప్రభావితమయ్యారని పేర్కొన్నాడు. యూనియన్లు కూడా 30 వేల మందిని తొలగించినట్లు పేర్కొంటున్నాయి. టీసీఎస్ మాత్రం ఖండిస్తోంది.
తొలగింపునకు కారణాలు..
ప్రధానంగా ఏఐ సాంకేతికతల ప్రభావంతో ఐటీ కంపెనీలు ఉదో్యగాల్లో కోత విధిస్తున్నాయని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఎందుకంటే ఏఐ టూల్స్ సరళమైన టాస్క్‌లను స్వయంచాలకం చేస్తున్నాయి. క్లయింట్లు 15-30% ఫీజు తగ్గింపులు డిమాండ్ చేస్తున్నారు, దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోంది. కొందరు ఉద్యోగులు రాజీనామా చేయమని బలవంతం చేయబడుతున్నారని, “ఫ్లూయిడిటీ లిస్ట్” వంటి విధానాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే, టీసీఎస్ మాత్రం ఇది వైపుణ్యాల అసమానతల కారణంగా జరిగినదని, AIతో సంబంధం లేదని చెబుతోంది.
సీఈవో ప్రకటనలో వైరుధ్యాలు..
టీసీఎస్ సీఈవో చేసిన ప్రకనలు విరుద్ధంగా ఆందోళన పెంచుతోంది. గతంలో “మా సంస్థలో తొలగింపులు లేవు, మేము సామాజిక బాధ్యత వహిస్తాం” అని ప్రకటించారు, కానీ ప్రస్తుత చర్యలు దీనికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులు ఇది కేవలం లాభాల పెంపు కోసం జరిగిన సంఖ్యల ఆట అని భావిస్తున్నారు. కొందరికి సెవరెన్స్ ప్యాకేజీలు ఇవ్వకుండా తొలగిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు.
మొత్తంగా ఇది ఐటీ సెక్టర్ మొత్తంలో ఇలాంటి ట్రెండ్లు ప్రారంభమవుతాయనే సూచనగా కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. టీసీఎస్ తన శ్రామిక బలాన్ని 6 లక్షల నుంచి 4.5 లక్షలకు తగ్గించాలని ప్లాన్ చేస్తుందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి, దీంతో సంవత్సరానికి 50 వేల ఉద్యోగాలు కోత విధిస్తారని తెలుస్తోంది. ఇది ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉద్యోగులు నూతన వైపుణ్యాలు సంపాదించాలి, కంపెనీలు ఎథికల్ ప్రాక్టీసెస్ పాటించాలి.