
Nandamuri Ramakrishna: నందమూరి కుటుంబంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నేడు ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తుండగా అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. కారు ముందు భాగం బాగా డామేజ్ అయ్యింది. దీంతో కారు అక్కడే వదిలేసి ఆయన వేరే వాహనంలో అక్కడి నుండి ఇంటికి వెళ్లారు.
నందమూరి రామకృష్ణ ప్రమాదం నుండి బయటపడ్డారని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేయలేదని సమాచారం. రోడ్డు ప్రమాదాల్లో నందమూరి కుటుంబానికి భయానక అనుభవాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, అన్నయ్య జానకి రామ్ రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు.
మరోవైపు తారకరత్న బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు మూడు వారాలుగా తారకరత్నకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక వారం నుండి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అమిగోస్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ పాక్షిక సమాచారం ఇచ్చారు. తారకరత్న ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్యులు బెటర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తారకరత్న ప్రజెంట్ కండిషన్ ఏమిటనేది డాక్టర్స్ చెబితే బాగుంటుంది. తను త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామంటూ కళ్యాణ్ రామ్ అన్నారు.

జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తుండగా మధ్యాహ్నం ఆయన కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. బెంగుళూరు నుండి వైద్య నిపుణులను పిలిపించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. పలు విభాగాలకు చెందిన నిపుణుల బృందం తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.