Taraka Ratna Health: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అయోమయం కొనసాగుతుంది. భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం నారాయణ హృదయాలయ వైద్యులు అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్ విడుదల చేశారు. మాక్సిమమ్ లైఫ్ సప్పోర్ట్ పై తారకరత్నకు వైద్యం జరుగుతుందని అధికారిక సమాచారం ఇచ్చారు. ఆదివారం చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తారకరత్నను సందర్శించిన ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తారకరత్న పోరాడుతున్నారు. ఆయన ఆత్మబలం, అభిమానుల ఆశీస్సులు క్షేమంగా బయటపడేలా చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే వైద్యానికి స్పందిస్తున్నట్లు చెప్పారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని వెల్లడించారు. కాగా ఆదివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో తారకరత్న సేఫ్ అంటూ ట్వీట్స్ వెల్లువెత్తాయి. తారకరత్న కోలుకుంటున్నారు. డాక్టర్స్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. కేవలం 10 వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారంటూ… నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ట్వీట్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు అదంతా ఫేక్ ప్రచారం అంటూ కొట్టిపారేస్తున్నారు.
తారకరత్న కోలుకుంటున్నారనే ప్రచారంలో నిజం లేదు. విషమంగానే ఉంది. సోమవారం మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అప్పుడు స్పష్టత రానుందని అంటున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ సిస్టర్ ఇదే విషయం చెప్పారు. సోమవారం వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. పరీక్షల అనంతరం తారకరత్న కండీషన్ తెలుస్తుందన్నారు. తారకరత్న ఆరోగ్యం మీద భిన్న వాదనలు వినిపిస్తుండగా ఒక అయోమయం ఏర్పడింది. ఆసుపత్రిలోకి మీడియాకు అనుమతి లేదు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ కారణంగా స్పష్టమైన సమాచారం బయటకు రావడం లేదు.

అయితే నేడు నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ఈ అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తారకరత్న కోలుకుంటున్నారనే గుడ్ న్యూస్ చెప్పాలని కోరుకుంటున్నారు. కాగా తారకరత్న జనవరి 27న అస్వస్థతకు గురయ్యారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం అదే రోజు రాత్రి బెంగుళూరు తరలించారు. ప్రత్యేక అంబులెన్సులో నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు రోజులుగా తారకరత్నకు చికిత్స జరుగుతుంది.