Tabarana Kathe Kannada Full Movie Review : కమల్ హాసన్ గొప్ప నటుడు. దశావతారం వంటి సినిమాలో పది పాత్రలు చేశాడు. అలాంటి నటుడు ఓ నటుడి ముందు తేలిపోయాడు. ఏకంగా జాతీయ పురస్కారం కోల్పోయాడు. 1986లో తెలుగులో కమల్‌హాసన్‌తో కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అనే సినిమా తీస్తున్న తరుణంలో పక్కన కర్ణాటకలో గిరీష్ కాసరవెల్లి అనే దిగ్గజ దర్శకుడు చారుహాసన్‌తో ‘తబరన కథె'(తబరుని కథ) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. చారుహాసన్ కమల్‌హాసన్ అన్న. నటి సుహాసిని తండ్రి. అవి మాత్రమే ఆయన ప్రత్యేకతలు కావు. 30 ఏళ్లపాటు వకీలుగా ప్రాక్టీస్ చేసి, 50 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. సహాయక పాత్రలే చేసినా గుర్తుండే పాత్రలు చేశారు. 55 ఏళ్ల వయసులో ఈ సినిమాలో ‘తబర’ అనే ప్రభుత్వ వాచ్‌మెన్ పాత్ర పోషించారు.

కథ ఏంటంటే
ప్రభుత్వ కార్యాలయాల్లో బోలెడు లొసుగులు ఉంటాయి. అందులో పనిచేస్తూ కూడా అవేమీ తెలియక మసిలే మనుషులు ఉంటారు. తమ పనిని చాలా నిజాయితీగా చేస్తూ, తమ లోకం తమది అన్నట్టు బతుకుతారు. అటువంటి వ్యక్తి రిటైరై ప్రభుత్వ కార్యాలయం ముందు చేరితే హక్కుగా అతనికి రావాల్సిన సొమ్ము అతనికి దక్కేందుకు ఇన్ని లాలూచీలా? ఇన్ని ఆరాలా? ఇన్నిన్ని పైరవీలా? ఇంత మోసమా? ఆ డబ్బు వస్తే అనారోగ్యంతో ఉన్న తన భార్యను బతికించుకోవాలని ఆ వృద్ధుడి తాపత్రయం. కానీ ఈ వ్యవస్థ వికృత రూపం అతనికేం తెలుసు? తిరిగి తిరిగి అరిగే అతని కాళ్లకేం తెలుసు?

భుజాల మీద మోశాడు
సినిమాను తన భుజాల మీద మోశాడు’ అని నటుల గురించి రాస్తుంటారు. నిజంగా అటువంటి కథ ఉండి, దానికి తగ్గ నటుడు ఉంటే సినిమా తనంతతానుగా అతని భుజాలమీదకు చేరుతుంది. ఈ సినిమా అలాంటిదే! చారుహాసన్ లాంటి నటుడిలో ఇంత ప్రతిభ ఉందా అని ఆశ్చర్యపోయేంత అద్భుతంగా నటించి మెప్పించారు. అమాయకత్వం, ఆక్రోశం, నిస్సహాయత కలగలిసిన ఆ పాత్రను చూస్తే జాలి కలుగుతుంది. తన భార్య కాలికి గాయమై, ఆపరేషన్ చేసి దాన్ని తొలగించేందుకు డబ్బు లేక, ఒక మటన్ కొట్టు ముందు నిలిచి ‘నా భార్య కాలు నువ్వు తీసేస్తావా?’ అని ఆ వ్యాపారిని దీనంగా అడుగుతాడు. ఆ సన్నివేశం చూస్తే అయ్యో అనిపిస్తుంది.
1986 జాతీయ సినీ పురస్కారాల్లో ‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌ను కూడా దాటి, అవార్డు కమిటీ చారుహాసన్‌కి ఉత్తమ నటుడి పురస్కారం అందించారు. ఒక తమిళ నటుడు 56 ఏళ్ల వయసులో తనది కాని మరో భాషలో నటించి జాతీయ పురస్కారం అందుకోవడం అదే తొలిసారి కావొచ్చు. ఇలాంటి ఫెర్మామెన్స్ కి నిజంగా ఆస్కార్ ఇవ్వొచ్చు. వర్థమాన నటులు తప్పకుండా ఈ సినిమా చూడాలి. కొంత బోర్ కొట్టేలా ఉన్నా ఓపికగా చూడండి. ముఖ్యంగా చారుహాసన్ నటన కోసం. వన్ ఆఫ్ ది పైనేస్ట్ పెర్మామెన్స్ ఇన్ ఇండియన్ సినిమా. అటువంటి నటుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం.ఈ సినిమా యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.
లింక్: