
Singer Vani Jayaram Postmortem Report: నేషనల్ అవార్డు సింగర్ వాణీ జయరాం మృతి సంగీత ప్రియులను శోక సముద్రంలో ముంచేసింది. ఐదు దశాబ్దాల పాటు వాణీ జయరామ్ తన స్వరంతో, మధుర గానంతో శ్రోతలను అలరించారు. ఆమె హఠాన్మరణంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వాణీ జయరాం అనుమానాస్పదంగా మృతి చెందడం మరింత కలచి వేసింది. వాణీ జయరాం మరణానికి కారణాలు తెలియాలని అభిమానులు కోరుకున్నారు. పోస్టుమార్టం, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు.
చెన్నైలో వాణీ జయరాం ఒంటరిగా ఉంటున్నారు. ఆమె భర్త జయరాం 2018లో కన్నుమూశారు. వాణీ జయరాంకి పిల్లలు లేరు. ఇంట్లో ఒక్కరే ఉంటారు. ఉదయం, సాయంత్రం పనిమనిషి వచ్చి ఇంటి వ్యవహారాలు చక్కబెట్టి పోతారు. వాణీ జయరాంకి అన్ని విషయాల్లో పనిమనిషి చేదోడు వాదోడుగా ఉంటారని సమాచారం. ఫిబ్రవరి 4వ తేదీన పనిమనిషి వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. వాణీ జయరాం నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. దాంతో పనిమనిషి వాణీ జయరాం సిస్టర్ కి కాల్ చేశారు. డూప్లికేట్ కీ తో మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లారు.
గదిలో వాణీ జయరాం విగతజీవిగా పడి ఉండటం గమనించారు. తలపై గాయం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వాణీ జయరాం మృతదేహాన్ని కిల్ పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అలాగే పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. పోస్ట్ మార్టం, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వాణీ జయరాం ప్రమాదవశాత్తు మరణించారని నిర్ధారించారు.

రెండు అడుగుల స్టూల్ పై నుండి వాణీ జయరాం క్రింద పడ్డారు. దాంతో తలకు బలమైన గాయమైంది. స్టూల్ కి రక్తపు మరకలు ఉన్నాయి. ఆమెకు చాలా సమయం వరకు వైద్య సహాయం అందలేదు. ఆ కారణంగా మృతి చెందారు. అలాగే వాణీ జయరాం ఇంట్లోకి అపరిచితులు ఎవ్వరూ ప్రవేశించలేదని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు. నివేదికలు వచ్చిన తర్వాత వాణీ జయరాంకి అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో ఆమె మరణాంతర కార్యక్రమాలు పూర్తి చేశారు.