WTC 2023 Table: ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం నవ్వితే ‘నా ఏడుపు నీకు నవ్వులాటగా ఉందా’ అంటారు బాధలో ఉన్నవారు. అంచ్చం ఇలాగే ఉంది ప్రస్తుతం టీం ఇండియా పరిస్థితి. ఆస్ట్రేలియా చేతిలో సౌత్ ఆఫ్రికా ఘోర పరాజయం మూటకట్టుకుంది. ఆ జట్టు బాధలో ఉండగా ఇండియా క్రికెట్ అభిమానులు మాత్రం సంబురాలు చేసుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా ఓటమితో టీం ఇండియా టెస్ట్ చాంపియన్‌షిప్ అవకాశాలు మెరుగవ్వడమే ఇందుకు కారణం.

ఘోర పరాజయం..
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మెల్బోర్న్ వేదికగా ఆతిద్య జట్టుతతో జరిగిన రెండో టెస్టులో కూడా సౌతాఫ్రికా చిత్తుగా ఓడిపోయింది. తొలి టెస్టులో రెండు రోజుల్లోనే చిత్తయిన దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులోనూ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు మ్యాచుల సిరీస్ లో మరో గేమ్ మిగిలుండగానే.. 2–0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021–23 పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
భారత జట్టుకు లాభం..
సౌతాఫ్రికా ఓటమితో టీమిండియాకు భారీ లాభం చేకూరనుంది. టీమిండియా ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. భారత జట్టుతోనే పాయింట్లలో పోటీపడుతున్న సౌతాఫ్రికా జట్టు అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచుకు ముందు మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.
టెస్టు క్రికెట్ ఆదరణ పెంచేందుకే..
టి20 క్రికెట్ వచ్చాక టెస్టు ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతోంది. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను తీసుకువచ్చింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ ముగియనుండగా.. టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టికలో నిలిచే తొలి రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలుస్తుంది..

తొలి చాంపియన్ న్యూజిలాండ్..
తొలి ఎడిషన్‌లో భారత్‌పై నెగ్గిన న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుతం 2021–2023 చాంపియన్‌షిప్ సైకిల్ కొనసాగుతున్నది. వచ్చే ఏడాదిలో టెస్ట్ సైకిల్ ముగియనుండగా.. ఓవల్ స్టేడియంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 10 గెలిస్తే.. మరోదాంట్లో ఓడిపోయింది. 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 78.57 శాతం విజయాలతో అగ్రస్థానంలో ఉంది. భారత జట్టు 58.93 శాతం విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా ఇప్పటివరుకు 14 మ్యాచులు ఆడింది. ఇందులో 8 గెలుపొందగా, 4 ఓడిపోయింది. 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా జట్టు 60 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. అయితే రెండు వరుస ఓటముల తర్వాత ప్రొటీస్ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. సఫారీకి 50 విజయాల శాతం ఉంది. సౌతాఫ్రికా ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆరు మ్యాచుల్లో నెగ్గగా.. మరో ఆరింటిలో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఇంకా ఒక టెస్ట్ మిగిలి ఉంది. ఈ టెస్టులో కూడా ఓడిపోతే సౌతాఫ్రికా అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి.
మూడో స్థానంలో శ్రీలంక..
ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమితో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో శ్రీలంక మూడో స్థానానికి ఎగబాకింది. శ్రీలంక ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. 5 గెలుపొందగా, 4 ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. శ్రీలంకకు 53.33 విజయశాతం ఉంది. పాకిస్తాన్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్ 46.97 విజయ శాతం ఉంది. 22 మ్యాచ్‌లు ఆడగా 10 గెలిచింది. మరో 4 మ్యాచులు డ్రా అయ్యాయి. 8 మ్యాచుల్లో ఓడిపోయింది స్టోక్స్ సేన. ఇక, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది పాకిస్తాన్. అయితే, బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు కూడా ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
టీం ఇండియాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ప్రస్తుత సీజన్‌లో టీమ్ ఇండియా ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌ల్లో కనీసం 3 మ్యాచ్‌లు గెలవాలి. ఫిబ్రవరి–మార్చిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాపై విజయం సాధించడం అంత సులువు కాదు. ఈ సిరీస్ సమయానికి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఇద్దరి వస్తే ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పవు.