Prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేయలేదని కోపంతో తండ్రి నే హతమార్చాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో బాలభద్రాచారి అనే వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆయనకు గురు నారాయణ అనే కుమారుడు ఉన్నాడు. వివిధ కారణాల రీత్యా గురు నారాయణకు ఇంతవరకు వివాహం జరగలేదు. అందుకు తండ్రి బాల భద్రాచరి కారణమని కోపం పెంచుకున్నాడు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం శనివారం తెల్లవారుజామున బాల భద్రాచారిని గురు నారాయణ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. తొలుత తన వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతు కోసి చంపాడు. ఆ తరువాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గుర్తించి గురునారాయణ ను ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. దీంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
గురునారాయణకు వయసు దాటుతోంది. కానీ వివాహం జరగకపోవడంతో గత కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉన్నాడు. తన వయసు వారికి వివాహాలు పూర్తయి.. పిల్లలతో హాయిగా గడవడాన్ని చూసి బాధపడేవాడు. కనీసం తన వివాహ ప్రయత్నానికి తండ్రి పూనుకోకపోవడంతో మనస్థాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో తండ్రి పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా మట్టు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఏవో మాటలు చెప్పి తండ్రిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.