Somu Veerraju: ఏపీలో ప్రతిపక్షాల పొత్తులు ఓ కొలిక్కి వచ్చేలా లేవు. భవిష్యత్తులో కుదిరేలా కూడా కనిపించడంలేదు. కొందరు ప్రతిపక్షాలన్నింటితో కలిసి వెళ్లాలని భావిస్తుంటే… మరికొందరు కొన్ని పార్టీలతోనే కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో ఏపీలో పొత్తుల వ్యవహారం అయోమయంగా మారింది. ఎవరు ఎవరితో కలిసి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఏపీలో పొత్తుల వ్యవహారం పై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి కుండబద్ధలు కొట్టారు. టీడీపీ , వైసీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలుగా సోమువీర్రాజు అభివర్ణించారు. ఇప్పటికీ జనసేనతో పొత్తులో ఉన్నామని, కలిసొస్తే జనసేనతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. లేదంటే తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని తెలిపారు. అయితే.. జనసేనతో పొత్తు విషయం పై సోమువీర్రాజు వ్యాఖ్యలు కొంత అయోమయానికి గురిచేస్తున్నాయని చెప్పవచ్చు.
ఇప్పటికే పొత్తులో ఉన్నామని, కలిసొస్తే జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే పొత్తులో ఉంటే మళ్లీ కలిసి రావాల్సిన అవసరం ఏముంది. జనసేనతో పొత్తులోనే ఉన్నాం.. కలిసి పోటీ చేస్తాం అని చెప్పవచ్చు కదా అన్న అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు కొంత గందరగోళానికి గురిచేసేవిగా ఉన్నట్టు కనిపిస్తోంది. జనసేన కూడా తమ వైఖరి పై స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి వెళ్లాలనేది .. జనసేన వ్యూహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాల ఓట్లు చీలితే అంతిమంగా అధికార పార్టీకి మేలు చేకూరుతుంది. దీనిని నివారించడానికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల పొత్తు పై దృష్టి కేంద్రీకరించారు.

గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో సోమువీర్రాజు ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. కేంద్ర పెద్దలతో తాను మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే.. కేంద్ర పెద్దల నుంచి ఏ మేరకు స్పందన వచ్చిందో తెలియదు. జనసేనాని మాత్రం పొత్తుల విషయం పై స్పష్టంగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయడమంటే.. వైసీపీకి అనుకూలంగా పనిచేయడమే అని చెప్పొచ్చు.