Drunk And Drive: తాటిచెట్టు కింద కూర్చుని పాలు తాగానంటే ఎవరైనా నమ్ముతారా?.. బార్‌లో కూర్చుండి.. కూల్‌డ్రింక్ తాగడానికి వచ్చా అంటే ఎవరైనా నమ్ముతారా.. ఎవరూ నమ్మరు. ఇదే తరహా ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి.. పోలీసులు అడిగిన ప్రశ్నకు వింత సమాధానం చెప్పాడు. అది విని పోలీసులు షాక్ అయ్యారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. వింత సమాధానం..
మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయలో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పోలీసులు వాహనాలను ఆపి.. తనిఖీలు జరుపుతుండగా కారులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చాడు. అందరి మాదిరిగానే అతనికి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా.. 94 శాతం రీడింగ్ పాయింట్లు నమోదయ్యాయి. దీంతో అతడిని కారు దింపి పక్కకు తీసుకెళ్లారు. ఏం చేస్తావని అడగగా సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తానని చెప్పాడు. ఏం తాగి వస్తున్నావని అడగగా.. పాలు తాగి వస్తున్నా సార్ అంటూ అమాయకంగా సమాధానం చెప్పాడు. పాలు తాగితే 94 రీడింగ్ వస్తుందా? అని పోలీసులే షాక్ అయ్యారు.
తప్పించుకోవాలనే..
డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు వివిధ మార్గాలు అనుసరిస్తారు. కొంతమంది వాహనం పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్తారు. కొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అమ్మాయిలు కూడా డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుపడి పోలీసులతో గొడవ పడిన ఘటనలు ఉన్నాయి. వీఐపీలు, వారి పిల్లలు హల్‌చల్ చేసిన ఘటనలు చూశాం. కానీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదేమీ చేయలేదు. అమాయకంగా పక్కన నిలబడ్డాడు. తాను మద్యం తాగనట్లు బిల్డప్ ఇచ్చాడు. అంతేకాదు. పోలీసులు అడిగితే పాలు తాగానని సమాధానం చెప్పాడు అయితే పోలీసులు రీడింగ్ 94 రావడంతో వామనం స్వాధీనం చేసుకుని అతడిని ఇంటికి పంపించారు.