
Mosquito Coil: మర్డర్.. అంటే కత్తితోనో, గన్‌తోనో.. గొడ్డలితోనో చేస్తారు.. సైలెంట్‌గా అయితే పాయిజనో.. సైనైడో ఇస్తారు. మరి మస్కిటో కాయిల్‌తో మర్డర్ ఎలా చేశారని అనుకుంటున్నారా.. కానీ, ఇది నిజం. ఒకరిద్దర్ని కాదు, ఏకంగా ఆరుగురిని చంపేసింది. అయితే ఈ మర్డర్ ఎవరో చేసింది కాదు. స్వతహాగా చేసుకున్నారు. అంత డేంజర్ అన్నమాట మస్కిటో కాయిల్. దోమలను చంపేస్తుందని వెలిగించిన మస్కిటో కాయిల్.. మనుషుల ప్రాణం తీసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
దోమల బాధ తప్పించుకుందామంటే..
దోమల బాధ నుంచి తప్పించుకునేందుకు సాధారణంగా అనేక పద్ధతులు అవలబిస్తాం. చాలా మంది లిక్విడ్స్ వాడుతున్నారు. పేదలు కాయిల్స్ వాడుతున్నారు. కొంతమంది సంపన్నులు కూడా కాయిల్స్ వైపే మొగ్గు చేపుతున్నారు. అయితే ఈ కాయిల్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. కాయిల్స్ పొగ మంచిది కాదని డాక్టర్లు చెప్పడంతో చాలా వరకు ఇనియోగం తగ్గింది. అయితే ఉత్పత్తి మాత్రం ఆగలేదు. దీంతో లిక్విడ్ అయిపోయినప్పుడు తప్పనిసరై కొంతమంది కాయిల్స్ వాడుతున్నారు. అయితే వీటి నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వాయువు దోమలను ఏ మేరకు నిరోధిస్తోందో తెలియడం లేదు కానీ, మనుషుల ప్రాణాలు మాత్రం తీస్తుంది. ధూమపానం చేయడం వల్ల జరిగే నష్టం కన్నా దోమల నిరోధక చక్రాల నుంచి వెలువడే వాయువు వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
ఢిల్లీలో ఆరుగురు బలి..
న్యూఢిల్లీలోని నార్త్‌ఈస్ట్ జిల్లా శాస్త్రి పార్క్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరు రాత్రంతా ఈ కాయిల్స్‌ను పెట్టుకుని, నిద్రపోతూ, వాటి నుంచి వచ్చిన వాయువును పీల్చారు. తెల్లవారేసరికి అందరూ విగత జీవులయ్యారు. మస్కిటో కాయిల్స్ వల్ల ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి.
ఎంత డేంజరో తెలుసా..
నిపుణుల సమాచారం ప్రకారం.. ఒక్కొక్క మస్కిటో కాయిల్ దాదాపు 75 సిగరెట్ల కంటే ఎక్కువ పొగను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీకు, మీ కుటుంబానికి ప్రమాదకరం. దోమలను చంపే ఈ కాయిల్స్ నుంచి వచ్చే పొగ.. శ్వాసనాళంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగిస్తుంది.. అంతేకాకుండా శ్వాసకు అడ్డంకిని మారి ఊపిరితిత్తులకు హాని చేస్తుంది. శరీరానికి కూడా అస్సలు మంచిది కాదు.

రసాయన పదార్ధాల మిశ్రమం..
మస్కిటో కాయిల్స్‌లో అనేక రకాల రసాయన పదార్థాల మిశ్రమం ఉంటుంది. ఆ మిశ్రమాలలో ఉండే పదార్థాలు మానవ శరీరానికి హానికరం. ఇందులో రెండు రకాల రసాయన పదార్ధాలు కలుస్తాయి. వాటిలో ఒకటి క్రిమిసంహారక మందు దోమలను చంపుతుంది.. మరొకటి సుగంధ పదార్థం (సిట్రోనెల్లా వంటివి) దోమలను తరిమివేస్తుంది.
ఇప్పటికైనా ప్రమాదకరమైన మస్కిటో కాయిల్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దోమలు ఎక్కువగా ఉంటే పాతకాలం నాటి దోమతెరలను వాడడం ఉత్తమం.